షేక్ హసీనా రిటర్న్- బంగ్లాదేశ్ ఫుల్ లాక్‌డౌన్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి రానున్నారనే ప్రకటన ఆ దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత, ఉద్రిక్తతకు దారితీసింది. ఆమె నాయకత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ ఈ నెల 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా ఫుల్ లాక్‌డౌన్ కు పిలుపునిచ్చింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి బంగ్లాదేశ్ లో పలు ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
షేక్ హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆవామీ లీగ్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగాయి. పలు భవనాలు, వ్యాపార సముదాయాలపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు. తమ నాయకురాలికి మద్దతుగా ఆవామీ లీగ్ మంగళవారం రాత్రి దేశవ్యాప్తంగా దివిటీ ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నిరసన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది.

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది.. ఆవామీ లీగ్. షేక్ హసీనాతో పాటు పార్టీ ముఖ్య నేతలపై నమోదైన రాజకీయ ప్రేరేపిత కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరింది. తమ పార్టీపై విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని, సాధారణ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని డిమాండ్ చేసింది. వివిధ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
రాజకీయ కోణంలోనే కాకుండా దేశంలో నెలకొన్న సమస్యలపైనా ఆవామీ లీగ్ స్పందించింది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని, విద్యుత్, గ్యాస్, ఇంధనం, ఎరువులు వంటి నిత్యవసరాల ధరలను గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. మూతపడిన పరిశ్రమలను తక్షణమే పునఃప్రారంభించి, ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. దోపిడీలు, హత్యలు, ఆక్రమణలను అరికట్టాలని పేర్కొంది.
1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట విజయ దినోత్సవ సందర్భంగా డిసెంబర్ 16న షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రానున్నట్లు వెలువడుతున్న కథనాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రకటన వెలువడిన తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అధినేత షఫికుర్ రెహ్మాన్ తన ఆస్ట్రేలియా, మలేషియా పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. తాజా పరిణామాలపై తారిక్ రెహ్మాన్ తదితర నాయకులతో ఆయన సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications
