చైనాను కుదిపిన భూకంపం..!!
China earthquake: చైనాలో భూకంపం సంభవించింది. ఆ దేశ పశ్చిమ ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. స్వల్పంగా ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే జనం ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాతా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 గా రికార్డయింది. ఈ వేకువ జామున చైనాలోని వెస్టర్న్ ప్రావిన్స్ సిచువాన్‌లోని డావోచెంగ్ పట్టణానికి ఉత్తర దిశగా సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. నెల రోజుల వ్యవధిలో ఇక్కడ భూమి ప్రకంపించడం ఇది రెండోసారి. కిందటి నెల సరిగ్గా 28వ తేదీ నాడే ఇదే ప్రావిన్స్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

29.744 ఉత్తర అక్షాంశం, 100.266 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు వివరించింది. 31,000 మందికి పైగా జనాభా గల పట్టణం.. డావోచెంగ్. దీంతో పాటు కాంగ్డింగ్, యాంగ్నింగ్, షాంగ్రిలా, హాంగ్క్వియావో వంటి పట్టణాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి.
ఇప్పటివరకు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. కొన్ని చోట్ల ఇళ్లకు బీటలు వారినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందు టిబెట్ లో తేలిక పాటి భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత నాలుగు కంటే తక్కువే.
చైనాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 4 లేదా అంతకంటే తీవ్రతతో వరుసగా భూమి ప్రకపించడం ఈ మధ్యకాలంలో తీవ్రతరమైంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోకి రాదు. అయినప్పటికీ.. యురేషియన్ ప్లేట్‌పై ఉంటుందీ దేశం. పసిఫిక్ ప్లేట్ ప్రధాన అంచులు.. అంటే రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలకు ఆనుకుని ఉండటం వల్ల వాటి ప్రభావం ఇక్కడ పడుతుంటుంది. సిచువాన్ వంటి చైనా పశ్చిమ ప్రాంతాలు ఫాల్ట్ లైన్ జోన్ లోకి వస్తాయి.












Click it and Unblock the Notifications
