28 వేల డాలర్ల మందు 40 డాలర్లకే! ఫార్మా రంగంలో హైదరాబాద్ మరో సంచలనం!!
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నివారణకు ఉద్దేశించిన కీలక ఔషధాన్ని అత్యంత తక్కువ ధరకు జెనరిక్ రూపంలో ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ హెటెరో ముందడుగు వేసింది. అమెరికాలో ఏడాదికి ఒక్కొక్కరికి దాదాపు 28,000 డాలర్ల వరకు లభించే ఈ ఔషధాన్ని.. హెటెరో తయారు చేసిన జెనరిక్ వెర్షన్ ద్వారా ఏడాదికి కేవలం 40 డాలర్లకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
జెనరిక్ లెనాకాపావిర్ ఎగుమతులు ప్రారంభం
హెటరో సంస్థ జెనరిక్ లెనాకాపావిర్ ఔషధాన్ని ఆఫ్రికా దేశాలకు పంపడం ప్రారంభించింది. ఇది ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ రూపంలో వేసుకునే నివారణ ఔషధం. ఈ ఔషధాన్ని తొలుత అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. రోజువారీ మాత్రలు కాకుండా ఏడాదికి కేవలం రెండు ఇంజన్లతోనే హెచ్ఐవీ నివారణకు ఉపయోగపడటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం జాంబియా, జింబాబ్వే, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాలకు ఈ ఔషధాలను రవాణా చేస్తున్నారు. హెచ్ఐవీ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ నివారణ ఔషధం చేరుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

అమెరికాలో ఏడాదికి 28,000 డాలర్లుగా ఉన్న ఈ ఔషధం ధర, హెటెరో రూపొందించిన జెనరిక్ వెర్షన్ ద్వారా ఏడాదికి ప్రతి ఒక్కరికీ కేవలం 40 డాలర్లకే లభించనుంది. ధరలో ఈ భారీ తేడా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ఊరటగా నిలుస్తోంది. తొలి దశలో ఆఫ్రికాలో దాదాపు 300 వయల్స్ సరఫరా చేస్తున్న హెటెరో సంస్థ రాబోయే రోజుల్లో అవసరాలకు అనుగుణంగా ఎగుమతులను మరింత పెంచాలని ప్రణాళిక రూపొందించింది.
120 దేశాలకు లైసెన్స్.. క్లినికల్ ట్రయల్స్
తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన 120 దేశాలకు ఈ హెచ్ఐవీ నివారణ ఔషధాన్ని అందుబోటులోకి తీసుకురావడానికి గిలియడ్ సైన్సెస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హెటెరో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తో పాటు మొత్తం 6 జెనరిక్ ఔషధ తయారీ సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసింది. 2024లో ఉగాంఢా, దక్షిణాఫ్రికాలో 5,000 మందికి పైగా కిశోరీలు, యువతులపై ఈ ఔషధానికి సంబంధించి కీలక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఈ ఔషధం తీసుకున్న వారిలో ఎవరికీ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకలేదని వెల్లడైంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల నేపథ్యంలో జులై 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఐవీ నివారణ కోసం ఈ ఔషధాన్ని సిఫార్సు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య రంగాల్లో ఈ ఔషధ వినియోగంపై మరింత దృష్టి నెలకొంది.














Click it and Unblock the Notifications
