డీలిమిటేషన్ పై కేంద్రానికి బిగ్ బ్రేక్ త్రూ: బిల్లుకు ఇండియా బ్లాక్ నుంచి ఫస్ట్ సపోర్ట్
డీలిమిటేషన్ అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులోని కీలక మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాల స్వరూపంలో భారీ మార్పులు తీసుకురావడమే కాకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడానికి మార్గం సుగమం చేస్తోంది.
ఈ నూతన ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 815 స్థానాలకు పెంచాలని నిర్ణయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను సమాన ప్రాతిపదికన 50 శాతం మేర పెంచేందుకు ఇందులో నిబంధనలు చేర్చారు. ఇది 2051 వరకు అమలులో ఉండబోతోంది. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి 1971 నాటి జనాభా లెక్కలు, నియోజకవర్గాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణకు 2011 జనాభా లెక్కల వివరాలను ఆధారం చేసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ బ్రేక్ త్రూ లభించింది. డీలిమిటేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై పార్టీ అధినేత శరద్ పవార్‌తో ముంబైలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జితేంద్ర అవ్హాద్ వెల్లడించారు. ముంబైలో పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.
దేశ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ ప్రక్రియకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని జితేంద్ర అవ్హాద్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తాత్కాలిక వైఖరి కాదని, రాజ్యాంగబద్ధమైన అవసరాలను గౌరవించడంలో భాగంగానే తీసుకున్నామని పేర్కొన్నారు. దేశంలో నియోజకవర్గాల సరిహద్దుల మార్పు, పెరిగిన జనాభా నిష్పత్తి ఆధారంగా ప్రాతినిధ్యం సర్దుబాటు చేయడం చట్టబద్ధమైన ప్రక్రియ అని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ప్రక్రియకు అనుకూలంగా నిలబడాలని శరద్ పవార్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో డిలిమిటేషన్ ప్రక్రియపై వివిధ రాజకీయ పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్న తరుణంలో ఎన్‌సీపీ-ఎస్పీ తీసుకున్న ఈ వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న వేళ.. శరద్ పవార్ వర్గం డీలిమిటేషన్‌కు అనుకూలంగా మొగ్గు చూపింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోన్నారు. ఇటువంటి కీలక సమయంలో శరద్ పవార్ వర్గం తీసుకున్న నిర్ణయం 'ఇండియా' కూటమి అంతర్గత విబేధాలను మరోసారి బయటపెట్టినట్టయింది.















Click it and Unblock the Notifications
