డీలిమిటేషన్ తో ఏపీకి జరిగేది ఇదే..! కేబినెట్లో తేల్చేసిన చంద్రబాబు..!
కేంద్ర ప్రభుత్వం మరోసారి డీలిమిటేషన్ తేనెతుట్టెను కదుపుతోంది. అయితే గతంలో చేసిన ప్రతిపాదనలను పక్కనబెట్టి, మెజార్టీ పార్టీలు కోరుతున్న విధంగా ప్రతీ రాష్ట్రంలో లోక్ సభ సీట్లను 50 శాతం పెంచాలని ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు (Chandrababu) డీలిమిటేషన్ విషయంలో కేంద్రం నిర్ణయంపై తన మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లులకు తాము ఎందుకు అండగా నిలవాలో వారికి చంద్రబాబు వివరించారు.
ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపడితే రాష్ట్రాలు నష్టపోతాయని చంద్రబాబు తెలిపారు. అందుకే కేంద్రం ప్రతీ రాష్ట్రంలో 50 శాతం లోక్ సభ సీట్లను పెంచే ప్రతిపాదన చేస్తోందని మంత్రులకు వివరించారు. దీని వల్ల ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబు మంంత్రులకు తెలిపారు. అందుకే ఈ ప్రతిపాదనకు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి తనకు ఢిల్లీకి రావాలని తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఆహ్వానం అందినట్లు సీఎం తెలిపారు. ఈ నెల 29 నుంచి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల సమావేశాలనూ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకూ ప్లాన్ చేసింది. ముందుగా లోక్ సభను నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లోనూ, అనంతరం డిసెంబర్ 1,2 తేదీల్లో రాజ్యసభను ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది. ఈ రెండు సభల్లోనూ డీలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని మరోసారి ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునేందుకు మద్దతు కూడగడుతోంది. ఇప్పటికే ఎన్డీయే పార్టీల మద్దతు ఉండటంతో , మిగిలిన విపక్ష ఇండియా కూటమిలో పలు పార్టీలను చీల్చడంతో పాటు నయానో, భయానో మద్దతిచ్చేలా ఒప్పిస్తోంది. తద్వారా ఈ రెండు బిల్లుల్ని ఈసారి కచ్చితంగా ఆమోదింపచేసుకోవాలనేది ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహంలా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
