పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహుర్తం ఫిక్స్- ఈ తేదీల్లో- మళ్లీ ఆ రెండు బిల్లులు..!
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక భేటీ (Special Parliament Session ) నిర్వహించేందుకు సిద్దమవుతోంది. గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా డీలిమిటేషన్, మహిళా బిల్లుల్ని ప్రవేశపెట్టినా మెజార్టీ లేకపోవడంతో నెగ్గించుకోలేకపోయిన కేంద్రం.. ఈసారి మాత్రం మారిన పరిస్ధితుల్లో విపక్షాలను చీల్చి ఎలాగైనా వాటిని నెగ్గించుకునేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల్ని ప్రోరోగ్ చేయకుండా రికార్డు స్దాయిలో కొనసాగిస్తున్న కేంద్రం.. వచ్చే వారం ప్రత్యేక భేటీ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.
ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసర కార్యకలాపాలను నిర్వహించే నిమిత్తం, లోక్‌సభను సోమవారం 30 నవంబర్ 2026న, రాజ్యసభను బుధవారం 2 డిసెంబర్ 2026న తిరిగి సమావేశపరచవలసిందిగా ప్రభుత్వం లోక్‌సభ గౌరవ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను కోరిందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అవసరాలను బట్టి, ఉభయ సభల సమావేశాలు 3 డిసెంబర్ 2026న ముగియవచ్చని ఆయన పేర్కొన్నారు.

తాజా సమాచారం ప్రకారం లోక్ సభ నవంబర్ 30, డిసెంబర్1 రెండు రోజుల పాటు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ డిసెంబర్ 2, 3 తేదీల్లో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలోనూ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల్ని ప్రవేశపెట్టి నెగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్యసభలో మెజార్టీ తెచ్చుకున్న కేంద్రానికి అక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదు. లోక్ సభలోనూ తాజాగా మారిన పరిస్ధితుల్లో డీఎంకే, ఎస్పీ, శరద్ పవార్ ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గాల సాయంతో ఈ బిల్లుల్ని కేంద్రం నెగ్గించుకోబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే విపక్షం ఈసారి అడ్డుపడ్డా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
గతంలో కేంద్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు 131ని ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింటి రెండొంతుల మెజార్టీని సాధించడంలో విఫలమైంది. అనంతరం ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అనంతరం ఇప్పటివరకూ పార్లమెంట్ ను ప్రోరోగ్ చేయకుండా కేంద్రం కొనసాగిస్తూ వస్తోంది. దీంతో చరిత్రలో తొలిసారిగా పార్లమెంట్ 100 రోజులకు పైగా ప్రోరోగ్ కాకుండా ఉంది. ఇప్పుడు తిరిగి పార్లమెంట్ ను ఈ బిల్లుల కోసం కేంద్రం సమావేశపరుస్తోంది. అయితే ఈ సమావేశాల్లో ఈ రెండు బిల్లులతో పాటు ఇంకా ఏ బిల్లుల్ని ప్రవేశపెట్టబోతున్నారో కేంద్రం వెల్లడించలేదు.














Click it and Unblock the Notifications
