ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలు..! వైసీపీతో పోలిస్తే కూటమికి భారీ ఎడ్జ్..!
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని దాదాపు 3 వేలకు పైగా స్ధానాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల (AP Gram Panchayat Elections) తొలిదశ పోలింగ్ ముగిసింది. దీంతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 7 గంటల తర్వాత అందిన తాజా ఫలితాల మేరకు మెజార్టీ సీట్లలో కూటమి పార్టీల మద్దతుదారులు విజయపథంలో ఉన్నారు. మరికొన్ని సీట్లలో విపక్ష వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధులు విజయాలు సాధిస్తున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్ధుల వారీగా ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

రాష్ట్రంలో తొలి దశలో 3949 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రాత్రి 9.30 గంటల సమయానికి 2855 సీట్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించారు. ఇందులో కూటమి పార్టీలన్నీ కలిపి 1962 సీట్లలో విజయం సాధించాయి. వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధులు 698 సీట్లలో గెలిచారు. ఇతరులకు మరో 195 సర్పంచ్ స్ధానాలు దక్కాయి. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే తిరుపతి జిల్లా వరకూ దాదాపు అన్ని చోట్లా కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్ధులు భారీ తేడాతో విజయాలు సాధిస్తున్నారు. కూటమి పార్టీలతో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్ధులు నామమాత్రంగానే గెలుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే తొలిదశ పంచాయతీ పోరును కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పలు జిల్లాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉండటంతో రేపటి కల్లా పూర్తి ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
