ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలో లబ్ధిదారుల నమోదును ఏ చిన్న పొరపాటుకూ అవకాశం లేకుండా పకడ్బందీగా అధికారులు చెయ్యాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న మొదలైన నమోదు ప్రక్రియ డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. బీమా వర్తించే కుటుంబ సభ్యుడి వివరాలతో పాటు, అతడు ఎంచుకున్న నామినీ పేరును కూడా పథకం పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
బీమా పొందే వ్యక్తి వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలని, నమోదు సమయంలో ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, నామినీ సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూడాలని సిబ్బందికి అధికారులు సూచిస్తున్నారు. ఒకరికి మించి నామినీలు ఉంటే, వారికి ఇచ్చే వాటాల శాతం మొత్తం కలిపి సరిగ్గా 100 శాతం అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. పోర్టల్‌లో సమాచారం ఎక్కించే సమయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మళ్లీ పరిశీలించి నిర్ధారించుకోవాలని ఆదేశించారు.

నమోదు కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ, పెండింగ్ దరఖాస్తులు మిగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి అర్హ కుటుంబంలో ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా లభిస్తుంది. నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీ ప్రకారం, 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించినవారు అర్హులు. నమోదు తర్వాత 59 ఏళ్లు దాటినా, కనీసం ఏడాది పాటు పూర్తి బీమా రక్షణ కొనసాగుతుంది. నామినీ మైనర్ అయితే, ఆ చిన్నారి తరఫున బీమా సొమ్ము అందుకునేందుకు ఒక పెద్దవారిని ప్రతినిధిగా నియమించాలి.
గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆధార్, నామినీ వివరాల్లో చిన్న తప్పు ఉన్నా, భవిష్యత్తులో క్లెయిమ్ సమయంలో ఇబ్బంది రావచ్చు. కాబట్టి అధికారులు ఇచ్చిన పక్కాగా నమోదు ఆదేశం చాలా కీలకం.












Click it and Unblock the Notifications
