15 ముక్కలుగా పాకిస్తాన్ ? ఆసిమ్ మునీర్ ప్లాన్ వెనుక ? అందుకే వ్యతిరేకత..!
ప్రస్తుతం నాలుగు ప్రావిన్సులుగా ఉన్న పాకిస్తాన్ ను (Pakistan) 12-15 ప్రావిన్సులుగా విభజించేందుకు సర్వసైన్యాధ్యక్షుడైన అనధికార నియంత ఆసిమ్ మునీర్ (Asim Munir) చేసిన ప్రతిపాదన ఆ దేశంలో కాక రేపుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నయానో భయానో లొంగదీసుకుని, తనను వ్యతిరేకిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సైతం సుదీర్ఘ కాలంలో జైల్లో ఉంచిన ఆసిమ్ మునీర్.. ఇప్పుడు పాకిస్తాన్ రూపు రేఖలు మార్చడం ద్వారా తన స్ధానం బలోపేతం చేసుకునేందుకు భారీ ప్రణాళికనే సిద్దం చేసుకుంటున్నారు.
పాకిస్తాన్ విభజన (Pakistan)
పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులు లేదా రాష్ట్రాలు పంజాబ్, సింధ్, ఖైబర్ పంఖ్తూక్వా, బలూచిస్తాన్. ఈ నాలుగు రాష్ట్రాలూ నాలుగు విభిన్న ప్రత్యేకతలు కలిగినవి. పంజాబ్ లో జనాభా ఎక్కువగా ఉంటే, బెలూచిస్తాన్ లో భూభాగం ఎక్కువగా ఉంది. సింధ్ లో కరాచీ, హైదరాబాద్ వంటి కీలక నగరాలు ఉంటే, ఖైబర్ పంఖ్తూన్వాలో గిరిజన జనాభాతో పాటు సహజ సంపద ఉంది. ఇవే ఇప్పుడు అసిమ్ మునీర్ ప్లాన్ కు వరంగా మారాయి.

12-15 ప్రాంతాలుగా విభజన
నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతల్ని తగ్గించాలంటే వాటిని విభజించడమే మార్గమనే ప్రతిపాదనను ఆసిమ్ మునీర్ తెరపైకి తెస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న నాలుగు రాష్ట్రాలు కాస్తా 12-15 ముక్కలుగా మారబోతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రతిపాదనపై బ్లూప్రింట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ విభజన పూర్తయినా ఆశ్చర్యం లేదు. తాజా ప్రతిపాదన ప్రకారం పంజాబ్ ను నాలుగు ప్రాంతాలుగా, సింధ్ రెండు ప్రాంతాలుగా, ఖైబర్ పంఖ్తూన్వా మూడు ప్రాంతాలుగా, బెలూచిస్తాన్ మూడు ప్రాంతాలుగా విభజించే అవకాశం ఉంది.

మునీర్ అసలు లక్ష్యమిదే?
అయితే వీటి వెనుక అసలు లక్ష్యం ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో రెండు కీలక పార్టీలు నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్(నవాజ్), భుట్టో కుటుంబం చేతుల్లో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) రెండింటినీ దెబ్బ కొట్టడం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపడం, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా ఓ అడ్డంకి తొలగించుకున్న ఆసిమ్ మునీర్ .. ఇప్పుడు పంజాబ్ విభజనతో పీఎంఎల్ (ఎన్), సింధ్ విభజనతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని గ్రహించిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు విభజన ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్నాయి. వీళ్ల మద్దతుదారులే ఇప్పుడు సింధ్ రోడ్లపైకి వచ్చి ఏకంగా ప్రత్యేక సింధు దేశం ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఈ ప్లాన్ లో ఆసిమ్ మునీర్ విజయం సాధిస్తే పాకిస్తాన్ పై మరింత పట్టు సాధించడం ఖాయం.














Click it and Unblock the Notifications
