ఉచిత విద్యుత్, ప్రతి నెలా రూ. 5,000 నిరుద్యోగ భృతి: రూ. 40,000 పెన్షన్: రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమీపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.
ఈ పరిణామాల మధ్య సమాజ్‌వాదీ పార్టీ కీలక అడుగు వేసింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లక్నో పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనేక వరాలను గుప్పించారు. యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునేలా పలు కీలక హామీలను ఇందులో పొందుపరిచారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీ
ఈ మేనిఫెస్టోకు సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పత్ర్- జన్ మన్ కా మేనిఫెస్టో అని పేరు పెట్టారు. యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు పొందుపరిచారు. తాము అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు వివిధ రంగాలు, పరిశ్రమల ద్వారా అదనంగా మరో రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ మేనిఫెస్టో ప్రకారం.. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగం లేదా ఉపాధి లభించేంత వరకూ కూడా ప్రతి నెలా రూ. 5,000 చొప్పున నిరుద్యోగ భృతి గానీ పౌష్టికాహార అలవెన్స్ ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి స్పష్టమైన కాలపరిమితిని విధించారు. ఒకే పరీక్ష ఉండే పోస్టులకు మూడు నెలలు, వివిధ దశల పరీక్షలు ఉండే ఉద్యోగాలకు ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తారు.
రాష్ట్రంలో నిరుద్యోగులను వేధిస్తున్న పేపర్ లీకేజీల అంశాన్ని కూడా మేనిఫెస్టో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీకేజీలు జరగకుండా పారదర్శక, అవినీతి రహిత వ్యవస్థను రూపొందిస్తారు. నియామకాల్లో ఏమైనా అక్రమాలు జరిగితే దానికి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులను పూర్తి స్థాయిలో జవాబుదారీలను చేస్తారు.
మహిళా సంక్షేమం, పంటలకు గ్యారెంటీ
మహిళా సంక్షేమం, సామాజిక న్యాయానికి మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. వయోవృద్ధ చేనేత మహిళ కార్మికులకు ప్రతి ఏటా రూ. 40,000 పింఛన్ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. పేదలకు అందుబాటు ధరలో ఆహారాన్ని అందించడానికి రూ. 5 కే భోజన థాలీ లభించే సమాజ్‌వాదీ క్యాంటీన్లను ప్రారంభిస్తారు. రూ. 50 కోట్ల వరకు ఉండే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
అన్నదాతల సంక్షేమానికి సంబంధించి అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)కి చట్టబద్ధమైన గ్యారెంటీ ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు టమోటా, బంగాళాదుంప, ఉల్లి వంటి పంటలను పండించే రైతులు నష్టపోకుండా ఉండటానికి రూ. 15,000 కోట్లతో ప్రత్యేకంగా ఓ ఫండ్ ను ఏర్పాటు చేస్తారు. ధరలు పడిపోయినప్పుడు దీని నుంచి నిధులను రైతాంగానికి విడుదల చేస్తారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రటించారు. అలాగే గ్రామీణులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లను ఇస్తారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించడం, చెరకు రైతులకు 24 గంటల్లోనే పంట బకాయిలు చెల్లించడం వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం మూసివేసిన 26,000 ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించి, అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఏడాది వ్యవధిలోనే భర్తీ చేస్తారు.
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి పేదలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని ఎస్పీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అయిదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని అఖిలేష్ హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందరికీ ఉచితంగా అందిస్తూ, ఉన్నత విద్యలో పేద విద్యార్థులు, వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక వర్గాలకు వర్గాల కోసం ప్రత్యేక విద్యా విధానాన్ని తెస్తామని అన్నారు.














Click it and Unblock the Notifications
