యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ఫార్ములా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంటోంది. నేడు ఢిల్లీలో ఈ రెండు పార్టీల ముఖ్య నాయకులతో కూడిన సమన్వయ కమిటీ మొదటి విడత భేటీ కానుంది. దాదాపుగా మూడు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పొత్తు స్వరూపం, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే అంశాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా చర్చించనున్నారు. అనంతరం ఆయా పార్టీల అధిష్ఠానాలకు తుది నివేదికను అందజేస్తారు.

సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, ఇతర ఇండియా బ్లాక్ మిత్రపక్షాలతో సంప్రదింపులు సాగించడానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, ఘోసీ ఎంపీ రాజీవ్ రాయ్, కైరానా ఎంపీ ఇక్రా హసన్ ఇందులో సభ్యులు. ఎస్పీ తరఫున ఈ కమిటీ సీట్ల పంపకాల చర్చలను పర్యవేక్షిస్తుంది.
సమాజ్‌వాదీ పార్టీతో చర్చలు జరిపడానికి కాంగ్రెస్ అధిష్టానం అయిదుమంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రాజేంద్రపాల్ గౌతమ్, పీసీసీ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా మోనా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వీరేంద్ర చౌదరి ఉన్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను ఎస్పీ టీమ్ ముందు ఉంచనుంది.
ప్రారంభంలో 181 అసెంబ్లీ స్థానాలతో కూడిన జాబితాను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 15 నాటికి నిర్ణయం తెలపాలని సమాజ్ వాది పార్టీని కోరింది. ప్రస్తుత చర్చల సందర్భంగా ఈ జాబితాను కాంగ్రెస్ పక్కనబెట్టినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రతిపాదించిన ఓ నూతన ఫార్ములా ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానాల సంఖ్య కంటే ఆయా నియోజకవర్గాలలో పార్టీకి ఉన్న బలం, గెలిచే అవకాశాల ఆధారంగానే సీట్లు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ ఆమోదంతో సీట్ల కోసం 60-50-70 ఫార్ములాను సిద్ధం చేసింది. మూడు దశల ఫార్ములా ఇది. మొదటి దశలో భాగంగా పూర్వాంచల్ నుంచి పశ్చిమ యూపీ వరకు కాంగ్రెస్ తప్పనిసరిగా పోటీ చేయాలనుకుంటున్న 60 కీలక స్థానాలను ప్రతిపాదిస్తుంది. రెండవ దశలో గతంలో మంచి పనితీరు కనబరిచిన సహారన్‌పూర్, మీరట్, మొరాదాబాద్ ప్రాంతాల్లోని 50 స్థానాలపై చర్చలు జరుపుతుంది.
చివరి దశలో పార్టీ యంత్రాంగం బలంగా ఉన్న మరికొన్ని స్థానాలను కోరనుంది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాలలో ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. అలాగే.. రాయ్‌బరేలీ, అమేథీ, ప్రయాగ్‌రాజ్ వంటి పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 70 అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించనుంది. సమాజ్‌వాదీ పార్టీ గతంలో కాంగ్రెస్‌కు 54 స్థానాల వరకు కేటాయించేందుకు ఆసక్తి చూపినప్పటికీ, ఇప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని విడివిడిగా విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.













Click it and Unblock the Notifications
