కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం - అభిషేకాలు, స్పర్శ దర్శనాల రద్దు..!!
రెండో కార్తీక సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కార్తీక రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఆలయంలో 'లక్ష దీపోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. భక్తులకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి కల్పించారు. శ్రీశైలానికి చేరుకున్న భక్తులు పాతాళగంగ లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.

సాయంత్రం లక్ష దీపోత్సవం
కాగా.. నిన్న (ఆదివారం) శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైలంతో పాటుగా శైవ క్షేత్రాలు సోమవారం వేళ భక్తులతో రద్దీగా మారాయి.పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామంలో కార్తీక సోమవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామి వారి నామస్మరణలతో మార్మోగుతోంది. శిరోభాగ నిలయంలో భక్తులు ఘనంగా దీపోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి.













Click it and Unblock the Notifications
