కరవు సాయం కింద రూ.30 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి: కాంగ్రెస్ పీఏసీ తీర్మానం!
తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి, రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక తీర్మానం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ, రాష్ట్ర కాంగ్రెస్ సలహా కమిటీల సంయుక్త భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడి ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు అజ్మతుల్లా హుస్సేన్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు. కరవు ప్రభావిత మండలాల్లో రైతులు, సామాన్య ప్రజలను ఆదుకునేందుకు నిధుల అవసరం ఎంతో ఉందని, ఇదే అంశంపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొత్తం నాలుగు ప్రధాన తీర్మానాలను పీఏసీ ఆమోదించిందని ఆయన వివరించారు.

రానున్న జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ, ప్రశ్నావళి నమూనాలో ఓబీసీ కాలమ్ లేకపోవడం పట్ల పీఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా తేలాలంటే ప్రశ్నావళిలో ఓబీసీ ఆప్షన్ తప్పనిసరిగా చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించింది. దీనివల్ల విద్యా, ఉపాధి, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు, బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు కచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన బి.ఎం.సందీప్‌కు పీఏసీ తరఫున స్వాగతం పలుకుతూ తీర్మానం చేశారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలలో పనిచేసిన అనుభవంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించిన సందీప్ రాకతో రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ సంస్థాగత బాధ్యతలు నిర్వహించిన ఆయన త్వరలోనే రాష్ట్ర నేతలతో విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరోవైపు, మాజీ ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ ఉన్నత విద్య నిమిత్తం లండన్ వెళ్లిన నేపథ్యంలో, ఆమె తెలంగాణ కాంగ్రెస్‌కు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానం చేశారు.
వచ్చే డిసెంబరు 7 నాటికి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత పెంచుతూ మండల, గ్రామ, పట్టణ, వార్డు స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంపై కార్యాచరణ రూపొందించారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని పొన్నం విమర్శించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications
