సికింద్రాబాద్‌లో 8నెలలు 16జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. రాణిగంజ్ అండర్‌బ్రిడ్జ్‌పై భారీ వాహనాలకు నిషేధం
సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారులకు ఇప్పుడు 8 నెలల పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంజీ రోడ్డులోని రాణిగంజ్ జంక్షన్ వద్ద ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జ్ నంబర్ 244ఏ మరమ్మతులు చేపట్టిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నవంబరు 20 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వంతెన కింద దాదాపు 1.5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నాయి. మూడు క్యారేజ్‌వే లేన్లలో పనులు నిర్వహించాల్సి రావడంతో రహదారిపై స్థలం తగ్గిపోయింది. ప్రస్తుతం ఆర్-2గా గుర్తించిన ఒక క్యారేజ్‌వేపై మాత్రమే తేలికపాటి వాహనాలకు అనుమతి ఇచ్చారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు మాత్రమే రాణిగంజ్ నుంచి ప్యారడైజ్, బోయిన్‌పల్లి వైపు వెళ్లేందుకు వీలుంటుంది.

భారీ వాహనాలు, సరకు రవాణా వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులకు ఈ మార్గంలో అనుమతి లేదు.భారీ వాహనాలు నిర్మాణ ప్రాంతంలోకి ప్రవేశించకుండా సికింద్రాబాద్ పరిధిలోని 16 ప్రధాన జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ ఎక్స్‌రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తున్నారు. ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్ నుంచి స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, ఎస్‌బీఐ ఎక్స్‌రోడ్స్ మీదుగా వచ్చే వాహనాలు క్లాక్‌టవర్ వైపు వెళ్లాలి.
ప్లాజా జంక్షన్ నుంచి వచ్చేవాటిని సీటీవో, రసూల్‌పురా, బేగంపేట వైపు పంపిస్తున్నారు. పార్క్‌లేన్ ఎక్స్‌రోడ్స్ నుంచి వచ్చే భారీ వాహనాలు ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.సీటీవో జంక్షన్ వద్ద మేడ్చల్, బోయిన్‌పల్లి నుంచి ఎన్‌హెచ్-44 మీదుగా వచ్చే భారీ వాహనాలకు రెండు మార్గాలు సూచించారు. కుడివైపు తిరిగేవాటిని రసూల్‌పురా, మొనప్ప, నిరంకారి, లక్డీకాపూల్ మీదుగా మళ్లిస్తారు.
ఎడమవైపు వెళ్లేవాటిని ఎస్‌బీఐ ఎక్స్‌రోడ్స్, వైఎంసీఏ, సంగీత్ ఎక్స్‌రోడ్స్, రైల్ నిలయం, అలుగడ్డబావి మీదుగా ముషీరాబాద్ లేదా మెట్‌టుగూడ వైపు పంపిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి సెయిలింగ్ క్లబ్ మీదుగా రాణిగంజ్ వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు మళ్లిస్తున్నారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చేవాటిని డీబీఆర్ మిల్స్, గాంధీనగర్ టీ జంక్షన్, కవాడిగూడ, సీజీవో టవర్స్ మీదుగా ముషీరాబాద్‌కు పంపిస్తారు.
కర్బలా ఎక్స్‌రోడ్స్ వద్ద బైబిల్ హౌస్ జంక్షన్, జబ్బార్ కాంప్లెక్స్, సీజీవో టవర్స్ మీదుగా మళ్లింపు జరుగుతోంది.ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ వైపు నుంచి రాణిగంజ్ వచ్చే తేలికపాటి వాహనాలు రాణిగంజ్ ఎక్స్‌రోడ్స్ వద్ద డిస్టిలరీ రోడ్ మీదుగా కర్బలా జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. నల్లగుట్ట ఎక్స్‌రోడ్స్ వద్ద వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. అధిక ఎత్తున్న వాహనాలు ప్రవేశించకుండా ప్యాట్నీ, ప్యారడైజ్, పార్క్‌లేన్, రసూల్‌పురా, కర్బలా ఎక్స్‌రోడ్స్ వద్ద 10 అడుగుల ఎత్తు పరిమితితో హైట్ రెస్ట్రిక్టర్ రైలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
రాణిగంజ్ ప్రధాన వాణిజ్య కేంద్రం కావడంతో హార్డ్‌వేర్, పనిముట్లు, యంత్రాలు, స్టీల్ వ్యాపారాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. సరకు రవాణా వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుండటంతో వ్యాపార కార్యకలాపాలపై కూడా ఈ ఆంక్షల ప్రభావం పడనుంది. ఎస్‌బీఐ ఎక్స్‌రోడ్స్, స్విమ్మింగ్‌పూల్ యూటర్న్, ప్లాజా, పట్నీ, ప్యారడైజ్, పార్క్‌లేన్, రాణిగంజ్, అద్వయ్య ఎక్స్‌రోడ్స్, నల్లగుట్ట, ఘాస్‌మండి, సెయిలింగ్ క్లబ్, కర్బలా, బైబిల్ హౌస్, సీజీవో టవర్స్, చిల్డ్రన్స్ పార్క్, కవాడిగూడ, లేపాక్షి, పాత అంబేడ్కర్ విగ్రహం ప్రాంతాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
