అమెరికా ఆయుధాలను కాదని మన ‘ఆకాష్’ వైపు చూస్తున్న దేశాలు
ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆయుధాలు కావాలంటే అమెరికావైపు చూసేవి. కానీ ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు మనదేశంవైపు చూస్తున్నాయి. భారత్ రూపొందించిన 'ఆకాష్' గగనతల రక్షణ వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి. అగ్రరాజ్యాలను సైతం ఆలోచించేలా చేస్తున్న మన ఆకాష్ తయారుచేసింది హైదరాబాద్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలే. 2022లో సుమారు రూ. 3,000 కోట్ల ఒప్పందంతో మన దగ్గర 'బ్రహ్మోస్' క్షిపణులు కొన్న ఫిలిప్పీన్స్, ఇప్పుడు మన 'ఆకాష్' ముఖ్యంగా ఆకాష్-1S రకం వ్యవస్థను తీసుకోవడానికి చర్చలు జరుపుతోంది. సముద్రంలో ముప్పుల కోసం బ్రహ్మోస్ వాడుతున్న ఆ దేశం, ఇప్పుడు గాల్లోని విమానాలు, క్షిపణులు, డ్రోన్ల నుంచి తమ సైనిక స్థావరాలను కాపాడుకోవడానికి ఆకాష్ వైపు చూస్తోంది. 'పినాకా' రాకెట్లపై కూడా చర్చలు సాగుతున్నాయి.
తీరు మార్చుకున్న యుద్ధాలు
ఇప్పుడు యుద్ధాల తీరు మారింది. చవకైన చిన్న డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లను ఆపడం పెద్ద దేశాలకు కూడా కష్టంగా మారింది. గల్ఫ్ ఘటనల్లో ఖరీదైన క్షిపణులతో డ్రోన్లను కూల్చడంలోని ఇబ్బందులు బయటపడ్డాయి. మరోవైపు, 'ఆపరేషన్ సిందూర్' టైమ్‌లో పాకిస్తాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను ఆపడంలో మన రక్షణ వ్యవస్థ, 'ఆకాశ్‌తీర్' కంట్రోల్ సిస్టమ్ బాగా పనిచేశాయి. దీంతో విదేశాల్లో కూడా ఆకాష్‌పై నమ్మకం పెరిగింది. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆకాష్ క్షిపణి, శబ్ద వేగం కంటే దాదాపు రెండున్నర రెట్లు వేగంతో దూసుకుపోతుంది. బూస్టర్ తర్వాత రామ్‌జెట్ ఇంజిన్ ఈ వేగాన్ని ఇస్తుంది. ఈ వ్యవస్థ సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను కూల్చగలదు. ఆకాష్-1Sలో మన దేశంలోనే తయారైన సీకర్ వల్ల చివరి క్షణంలో లక్ష్యాన్ని కచ్చితంగా తాకే శక్తి పెరుగుతుంది. ఇందులో 3D రాడార్, కంట్రోల్ రూమ్, నాలుగు లాంచర్లు ఉంటాయి. బీడీఎల్, బీఈఎల్ వీటిని తయారు చేస్తున్నాయి.

ఆఫ్రికాలోని అన్ని దేశాలు
ఫిలిప్పీన్స్‌తో పాటు ఆర్మేనియా లాంటి దేశాలు ఆకాష్‌పై ఆసక్తి చూపుతున్నాయి. పినాకా, స్వాతి రాడార్లకు కూడా విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. దేశీయ రక్షణ ఉత్పత్తిని 2025-26లో రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్లకు చేర్చిన భారత్, 2029 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యంతో ముందుకెళ్తోంది. అమెరికా ఆయుధాల వైపు కాకుండా ప్రపంచం చూపు మన ఆకాష్ వైపు మళ్లడం భారత్‌కు పెద్ద బలం. వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఆఫ్రికా ఖండానికి చెందిన చాలా దేశాలు, యూఏఈకి చెందిన దేశాల నుంచి మన ఆయుధాలకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ నుంచి రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 80కి పైగా దేశాలకు విస్తరించాయి. ప్రధానంగా క్షిపణులు, రాడార్లు, గస్తీ నౌకలు, సాయుధ వాహనాలు, మందుగుండు సామగ్రి, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని రక్షణ రంగ నివేదికలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications
