ఎన్నికల వేళ.. యూపీ మంత్రులకు బిగ్ టాస్క్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ పరిణామాల మధ్య బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్‌ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని పార్టీ నాయకత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాలన విధానాలు, పార్టీ సంస్థాగత నిర్వాహకుల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ప్రభారీ మంత్రి ప్రవాస్ యోజన పేరిట అమలు చేయనున్నారు. దీని ప్రకారం ప్రతి ఇన్‌ఛార్జ్ మంత్రి తమకు కేటాయించిన జిల్లాల్లో క్రమం తప్పకుండా పర్యటించడం, ఒక రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. ఈ పర్యటనల సమయంలో జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గాల ఇన్ చార్జీలు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా ప్రముఖులతో మంత్రులు సమావేశమౌతారు. జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చలు జరుపుతారు.
క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి, స్థానిక నాయకత్వంలో ఉన్న చిన్నపాటి అసంతృప్తులను ప్రారంభదశలోనే తొలగించడానికి ఈ పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తోన్నాయి. మంత్రులు ప్రభుత్వ సమీక్షలకే పరిమితం కాకుండా, పార్టీ శ్రేణులతో నేరుగా మమేకమవడం వల్ల కింది స్థాయి కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపవచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
ప్రతి జిల్లా పర్యటనలోనూ దాదాపు నాలుగు నుంచి అయిదుమంది సీనియర్ కార్యకర్తలతో మంత్రులు ముఖాముఖిగా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, స్థానిక యంత్రాంగం వద్ద ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటనే అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. కార్యకర్తలు తమ ఫిర్యాదులు, సమస్యలు, సూచనలను ఎలాంటి అడ్డంకులు లేకుండా మంత్రుల దృష్టికి నేరుగా తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది.
వీటిని త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుంది.. మంత్రులకు. తమకు అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పూర్తి బాధ్యతను కూడా ఇన్‌ఛార్జ్ మంత్రులకే అప్పగించారు. దీనిద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ప్రభుత్వం, పార్టీ పట్ల పూర్తి నమ్మకం పెరుగుతుందని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది.













Click it and Unblock the Notifications
