యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాకొచ్చే సీట్లు ఇన్ని- సీఎం యోగి ఆదిత్యనాథ్ క్లియర్ కట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ 80-20 ఈక్వేషన్లను మరోసారి తెరపైకి తెచ్చారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో తిరుగులేని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం ఓట్లతో పాటు మెజారిటీ స్థానాలను ఎన్డీఏ సునాయాసంగా కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించామని ఆయన చెబుతున్నారు. గెలుపుపై ఎలాంటి అనుమానాల్లేవని స్పష్టం చేస్తోన్నారు.

ఆజ్‌తక్ పంచాయత్ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమం, శాంతిభద్రతలు, అభివృద్ధికే పట్టం కడతారని వెల్లడించారు. అందుకే ప్రతిపక్షాలకు 20 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 350 కంటే ఎక్కువ స్థానాలు దాటుతాయనే విశ్వాసం తనకు ఉందని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. 80: 20 నిష్పత్తి ఓట్లతో ఖచ్చితంగా గెలుచుకుంటామని అన్నారు.
ఈ 80-20 ఫార్ములాను మొదటిసారిగా 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రయోగించారు.. యోగి ఆదిత్యనాథ్. జాతీయవాదం, సుపరిపాలన, శాంతిభద్రతలను కోరుకునే 80 శాతం మంది ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని అప్పట్లో వ్యాఖ్యానించారు. మిగిలిన 20 శాతం మంది ప్రతిపక్షాల వైపు ఉంటారని విశ్లేషించారు. ఇప్పుడు మళ్లీ అదే సమీకరణాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం ప్రారంభిస్తామని ఆయన తేల్చి చెప్పారు. తద్వారా తన సాంప్రదాయ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసుకోగలుగుతామని వ్యాఖ్యానించారు.
మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ శాసనసభలో 80 శాతం సీట్లు గెలవడం అంటే ఎన్డీఏ కూటమి దాదాపు 322 సీట్లల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే 2017లో ఎన్డీఏ కూటమి 325 సీట్లు సాధించింది. అందులో బీజేపీ సొంతంగా 312 సీట్లను గెలుచుకుంది. 2022 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ బలం 273 సీట్లకు పరిమితమైంది. అందులో బీజేపీకి దక్కిన స్థానాలు 255 మాత్రమే. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలను తిరిగి దక్కించుకుని, 2017 నాటి ఘనవిజయాన్ని పునరావృతం చేస్తామని యోగి ఆదిత్యానథ్ స్పష్టం చేశారు.
ఈ 80-20 ఫార్ములా ద్వారా పార్టీ కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు పెట్టారనేది ఈ స్టేట్ మెంట్ తో తేటతెల్లమైంది. అదే సమయంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ దీన్ని ఎలా అధిగమిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. ఒకవైపు బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదం, మరోవైపు ప్రతిపక్షాలు నిరుద్యోగం, అధికధరలు, స్థానిక సమస్యలే ప్రధానంగా ప్రతిపక్షాలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి.












Click it and Unblock the Notifications
