మంత్రుల కుక్కలకు రూ.5 వేలు.. రైతులకు అంతేనా? ప్రభుత్వంపై అభిజిత్ దీప్కే సెటైర్లు!
మహారాష్ట్రలో రైతుల దుస్థితి, విదర్భలో రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పెంపుడు కుక్కల ఖర్చే నెలకు రూ.5 వేలు ఉంటుందని.. అలాంటిది దీపావళికి ముందు రైతులకు అంతే మొత్తంలో సాయం ఇచ్చి ప్రభుత్వం అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం కుటుంబం కూడా రూ.5 వేలతోనే దీపావళి జరుపుకుంటుందా? అని నిలదీశారు.
యవత్మాల్ పర్యటనలో షాకింగ్ కామెంట్స్
మహారాష్ట్ర రైతుల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పబ్లిక్ ప్రచారంలో భాగంగా అభిజిత్ దీప్కే శుక్రవారం యవత్మాల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పెద్ద పారిశ్రామికవేత్తల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రభుత్వం, రైతుల రుణమాఫీ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సాయం పేరుతో కేవలం రూ.5 వేలు ఇస్తున్నారని.. చాలా మంది రైతులకు ఆ మొత్తం కూడా అందలేదని వెల్లడించారు.

గత 11 నెలల్లో విదర్భ ప్రాంతంలోనే దాదాపు 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా విదర్భకు చెందినవారే అయినప్పటికీ.. రైతుల ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టకుండా కొల్హాపూర్‌లోని గోకుల్ మిల్క్ డెయిరీని చేజిక్కించుకోవడంపై శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అభిజిత్ దీప్కే అన్నారు. గోకుల్ డెయిరీనే నిర్వహించాలనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి.. రైతులు మేలు కోరే నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
జిల్లా పరిషత్ పాఠశాల తనిఖీలో ఆగ్రహం
జిల్లా పర్యటనలో భాగంగా ధోత్రా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను కూడా అభిజిత్ దీప్కే పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలను స్వయంగా చూసిన అనంతరం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలకు వస్తున్నారని.. నిర్ణీత సమయానికి ముందే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేవని.. ఉన్నవాటికి తలుపులు, పైకప్పు కూడా లేవని, తరగతి గదుల్లో వెదురు బొంగులు ఉన్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రేకుల షెడ్ల కింద బడులు నడుస్తున్నాయని.. రైతులతో పాటు వారి పిల్లల చదువును కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందో సీఎం ఫడ్నవీస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications
