రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? డేంజర్ బెల్స్.. జాగ్రత్త!
ఆఫీసు పనుల కోసమో, చదువుల కోసమో చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిచేస్తూ ఉంటారు. బయటకు చూడటానికి ఇది సాధారణ విషయమే అయినా, ఇలా గంటల తరబడి కదలకుండా కూర్చోవడం శరీరానికి పెద్దగా మేలు చేయదని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్ లో ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగుతాయని అంటున్నారు.
నిరంతరం స్క్రీన్ ముందు గడపడం వల్ల శారీరక ఇబ్బందులతో పాటు, కొందరిలో మానసిక ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో తొమ్మిదిన్నర గంటలకు మించి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారిలో ఆరోగ్య ముప్పు, అకాల మరణ ప్రమాదం కొంత ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అందుకే పని ఎంత ఉన్నా, కనీసం ప్రతి అరగంటకు ఒకసారైనా కుర్చీలో నుంచి లేచి ఐదు నిమిషాలు అటూ ఇటూ నడవడం మంచి అలవాటు. అలా కాసేపు కదలడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, మనసు కూడా కాస్త తేలిక పడుతుంది. ఒకే భంగిమలో చాలాసేపు కూర్చోవడం వల్ల భుజాలు, మెడ, వీపు పట్టేసినట్టుగా అనిపిస్తాయి. చాలామంది స్క్రీన్‌ను తగిన ఎత్తులో పెట్టుకోకుండా కిందకు వంగి చూస్తూ పనిచేస్తుంటారు.
దీనివల్ల సర్వైకల్ సమస్యలు, నడుం, వెన్ను నొప్పులు మొదలవుతాయి. వీటిని తగ్గించుకోవాలంటే కంప్యూటర్ స్క్రీన్ కంటికి, తలకు సమానంగా ఉండేలా సర్దుకోవాలి. పాదాలు నేలపై సౌకర్యవంతంగా ఆనేలా, మోకాళ్లు సుమారు 90 డిగ్రీల కోణంలో ఉండేలా మంచి కుర్చీని ఎంచుకోవడం వల్ల నడుంపై భారం తగ్గుతుంది. కళ్ళు, చర్మంపై కూడా ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే ప్రభావం పడుతుంది.
కళ్ళు పొడిబారడం, మంట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కనీసం ఇరవై సెకన్ల పాటు ఇరవై అడుగుల దూరంలోని వస్తువు వైపు చూడటం కళ్లకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడే సులభమైన మెడ, భుజాల సాగతీత వ్యాయామాలు చేయడం, నీళ్లు తగినంత తాగడం, పని మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.













Click it and Unblock the Notifications
