రేపు తిరప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మదురైలోని తిరప్పరంకుండ్రం కొండపై ఉన్న 'దీపదూన్' రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ, రాష్ట్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా చేసిన అవిధేయత కిందకు వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. శనివారం(నవంబర్ 28) దీపదూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను(సీఆర్పీఎఫ్) మోహరించాలని స్పష్టం చేసింది. ఆలయం, సమీపంలోని దర్గా వద్ద శాంతి నెలకొల్పాలని.. రెండు చోట్ల మతపరమైన కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది.
ధర్మకర్తల మండలి సస్పెన్షన్.. రిసీవర్ నియామకం
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. తిరప్పరంకుండ్రం ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసింది. ఆలయ రిసీవర్ గా మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. "ఇలాంటి పరిస్థితులను ఉక్కుపాదంతో అణచాల్సిన సమయం వచ్చింది. లేదంటే ఇది రాజ్యాంగ అస్తవ్యస్తతకు దారితీస్తుంది. ఎవరైనా రాజ్యాంగ అస్తవ్యస్తత సృష్టించాలని చూస్తే మేము సరిదిద్దుతాం" అని జస్టిస్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. పరిపాలన బాధ్యతలు అప్పగించిన అధికారుల తీరు, ముఖ్యంగా మదురై జిల్లాలో పాలనాపరమైన అస్తవ్యస్తతను ప్రాథమికంగా సూచిస్తోందని కోర్టు పేర్కొంది.

మదురై కలెక్టర్‌పై ప్రశ్నల వర్షం
దీపం వెలిగించకపోవడంపై మదురై కలెక్టర్ నిషాంత్ కృష్ణను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత మీదేనని, జిల్లా మేజిస్ట్రేట్ గా మీరు ఆ పని చేసి ఉండాల్సిందని కలెక్టర్ తరఫు న్యాయవాదితో ధర్మాసనం పేర్కొంది. కలెక్టర్ దాఖలు చేసిన నివేదికను మొసలి కన్నీరు కార్చే ప్రయత్నంగా అభివర్ణించింది.
అధికారులకు నోటీసులు.. చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు
దీపం వివాదానికి సంబంధించిన సమావేశాల వివరాలు, సందేశాలు, కాల్ డేటా రికార్డులతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ మహేష్ అగర్వాల్, హిందూ మత ధర్మాదాయ శాఖ కమిషనర్, మదురై కలెక్టర్ నిషాంత్ కృష్ణ, మదురై పోలీసు కమిషనర్, ఎస్పీ, ఆలయ ధర్మకర్తల మండలికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
నవంబర్ 24 ఘటనలు
సుప్రీంకోర్టు అనుమతి ఉన్నప్పటికీ.. నవంబర్ 24 కార్తిక దీపాన్ని కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద కాకుండా..సంప్రదాయ ప్రదేశమైన ఉచ్చిపిళ్లైయార్ మండపం వద్ద మాత్రమే వెలిగించారు. నవంబర్ 24న సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించాల్సి ఉన్నప్పటికీ.. భారీగా పోలీసులను మోహరించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత, రాత్రి 7.30 గంటలకు ధర్మకర్తల మండలి దీపం వెలిగించవద్దని నిర్ణయించిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పురావస్తు శాఖ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. నిర్దేశిత స్తంభం వద్ద దీపం వెలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మకర్తల మండలి సభ్యులు ప్రభుత్వ నియామకాలే తప్ప భక్తులు కారని వాదించారు. కాగా బుధవారం తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై కోర్టుకు క్షమాపణ చెప్పి, ఆలయ అధికారులపై నెపం వేసింది. మదురై కలెక్టర్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.














Click it and Unblock the Notifications
