గ్రామాల్లోనూ వైసీపీకి షాకులే - ఓటు బ్యాంక్ భారీ పతనం- క్యాడర్ డీలా..!
ఏపీలో తాజాగా జరిగిన తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు విపక్ష వైఎస్సార్సీపీకి (YSRCP) భారీ షాకులిచ్చాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటముల తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్నీ వైసీపీ పేలవంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని నిశితంగా గమనిస్తే వైఎస్సార్సీపీ పల్లెల్లోనూ వెనుకబడినట్లు అర్దమవుతోంది. గతంలో సార్వత్రిక ఎన్నికల ఓటు బ్యాంకుతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 15 శాతం ఓటు బ్యాంక్ కోల్పోయినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ క్యాడర్ కూడా డీలా పడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీకి భారీ పరాజయం తప్పలేదు. అధికార కూటమి పార్టీల జోరు ముందు వైసీపీ పల్లెల్లో సైతం నిలవలేకపోయింది. ఇది గ్రామస్థాయిలో పార్టీ బలహీనపడుతున్న తీరుకు అద్దం పడుతోంది. రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో 39 శాతం ఓటు బ్యాంకుతో బలంగా ఉన్నట్లు కనిపించిన వైఎస్సార్‌సీపీ.. ప్రస్తుతం 24.6 శాతానికి పడిపోవడం ఆ పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. దీంతో వైఎస్సార్సీపీకి రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా నాయకత్వ నిర్ణయాలు, వ్యవహారశైలి కారణంగా తెలుస్తోంది. దీంతో గ్రామస్థాయిలో పార్టీ అంతకంతకూ నిర్వీర్యమవుతోంది. క్రమంగా కేడర్ బలహీనపడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా ఆ మేరకు తగ్గిపోతోంది.

పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. నామమాత్రపు ఫలితాలతో వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయిలో ఏ మేరకు పట్టు కోల్పోయిందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో సహజంగానే వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై నమ్మకం తగ్గుతోందా? కేడర్‌లో నిరుత్సాహం పెరుగుతోందా? వంటి ప్రశ్నల్ని పంచాయతీ ఎన్నికల ఫలితాలు లేవనెత్తుతున్నాయి. దీనికి జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు వెంటనే సమాధానం వెతుక్కోకపోతే భవిష్యత్తులో పార్టీ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం కావడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
