బాసర నుంచి భద్రాద్రి వరకు ఆలయాలకు కొత్త శోభ: గోదావరి తీరంలో టెంపుల్ కారిడార్!
తెలంగాణలో గోదావరి నది వెంట ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సరికొత్త వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేగవంతం చేసింది. ఉత్తరాన అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం మొదలుకొని, దక్షిణాన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం వరకు ఉన్న క్షేత్రాలను ఒకే ఆధ్యాత్మిక మార్గంగా-టెంపుల్ కారిడార్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయాల రూపురేఖలు మార్చడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పనులపై ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దేవస్థానం చుట్టూ రూ. 300 కోట్ల అంచనాతో చేపట్టిన నిర్మాణాలు రాబోయే రెండు శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా రాతి కట్టడాలతో రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముక్కోటి ఏకాదశి నాటికి ప్రధాన నిర్మాణాలను పూర్తి చేసి, దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షిస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు గోదావరి పుష్కరాల కోసం వివిధ శాఖల ద్వారా రూ. 1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పుష్కరాల సమయంలో భద్రాచలానికి కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీ నియంత్రణ, తాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ముందుగానే పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో రంగనాయకుల గుట్ట వద్ద గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ పనులతో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
అటు బాసరలోనూ చదువుల తల్లి ఆలయానికి కొత్త శోభ చేకూరుతోంది. కృష్ణశిలలతో ప్రధాన గర్భాలయం, మహంకాళి ఆలయం, ప్రాకార మండపాలను పునర్నిర్మించే పనులకు దాతల సహకారంతో ఇటీవల శ్రీకారం చుట్టారు. శృంగేరి పీఠం మార్గదర్శకత్వంలో ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ కారిడార్ అభివృద్ధితో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే యాత్రికులకు ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, స్థానికంగా పర్యాటకం, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
