డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు, బీజేపీతో పొత్తుపై తేల్చేసిన స్టాలిన్..! 2 డిమాండ్లు..!
కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నెగ్గించుకోలేకపోయిన డీలిమిటేషన్, మహిళా బిల్లుల్ని మరోసారి ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు వచ్చే వారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతంది. ఈ నేపధ్యంలో కేంద్రంలో అధికార బీజేపీతో తమిళళనాడులో విపక్ష డీఎంకే పొత్తు పెట్టుకోబోతోందని, ఈ బిల్లులకు మద్దతిస్తుందని, ఇప్పటికే గవర్నర్ అర్లేకర్ తో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ భేటీ వెనుక మర్మం ఇదేనని విజయ్ పార్టీ టీవీకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) ఈ విమర్శలపై స్పందిస్తూ తమ స్టాండ్ ఏంటో చెప్పేశారు.
కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (డీలిమిటేషన్ బిల్లు) విషయంలో తమపై వస్తున్న విమర్శలకు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో డీఎంకే వైఖరిలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన తేల్చిచెప్పేశారు. విజయ్ పార్టీ టీవీకే.. డీఎంకే-బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు చేసిన వ్యాఖ్యల తర్వాత స్టాలిన్ ఈ క్లారిటీ ఇచ్చారు. తద్వారా కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఎంపీలు మద్దతివ్వబోతున్నారనే ఊహాగానాలకు తెరదించారు. అంతే కాదు మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ బిల్లు విషయంలో తమ రెండు ప్రధాన డిమాండ్లపై దృఢంగా ఉన్నట్లు స్టాలిన్ స్పష్టంచేశారు.

లోక్ సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 సీట్ల వాటా, నియోజకవర్గాల మొత్తం సంఖ్య పెరిగినా తగ్గకూడదనే తమ ప్రధాన డిమాండ్ ను ఈ సందర్భంగా స్టాలిన్ మరోసారి ప్రస్తావించారు. అలాగే 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో పాతికేళ్ల పాటు యథాతథంగా ఉంచాలనేద తమ రెండో డిమాండ్ అని స్టాలిన్ తెలిపారు. ఈ రెండు డిమాండ్ల విషయంలో డీఎంకే అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నారు. భవిష్యత్తులోనూ వీటిపై తమ వైఖరి ఇదే అని స్టాలిన్ తేల్చిచెప్పేశారు. ఇందులో ఎలాంటి రాజీ లేదన్నారు.














Click it and Unblock the Notifications
