షర్మిలకు YSR ఇచ్చిన ఆస్తుల చిట్టా, జగన్ నుంచి ఇలా- అసలు లెక్కలు..!!
మాజీ సీఎం జగన్ - పీసీసీ చీఫ్ షర్మిల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇద్దరి మధ్య ఆస్తుల వ్యవహారం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. షర్మిల కుమార్తె వివాహం - యలహంక నివాసంలో చేయటానికి జగన్ అభ్యంతరం .. కోర్టు నోటీసుల తో ఈ వ్యవహారం తారా స్థాయికి చేరింది. షర్మిల కుమార్తె వివాహానికి జగన్ దూరంగా ఉన్నారు. ఈ సమయంలోనే అసలు వైఎస్సార్ తన కుమార్తెకు ఆస్తులు గా ఏం ఇచ్చారు.. జగన్ నుంచి ఏం దక్కిందనేది వైసీపీ ముఖ్య నేత బయట పెట్టారు.
షర్మిల కుమార్తె వివాహం వేళ మరింత చర్చగా మారిన ఆస్తుల వ్యవహారం పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కీలక అంశాలను బయట పెట్టారు. జగన్- షర్మిల మధ్య చోటు చేసుకుంటున్న కుటుంబ వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని వైసీపీ స్పష్టం చేసినా రాచమల్లు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ షర్మిలకు ఇచ్చిన ఆస్తులు ఇవే అంటూ ఒక పెద్ద జాబితానే విడుదల చేశారు. వైఎస్సార్ మాత్రమే కాదు జగన్ కూడా షర్మిలకు ఏకంగా 236 కోట్ల రూపాయల నగదును వైట్ మనీగానే ఇచ్చారు అని రాచమల్లు చెప్పుకొచ్చారు. షర్మిల కు అవసరం అయిన ప్రతీ సందర్భంలో జగన్ కోట్ల రూపాయల నగదు ఇస్తూనే ఉన్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ షర్మిలకు భారీగానే ఆస్తులు ఇచ్చారని ఆయన చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇంటిని షర్మిలకు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. అలాగే ఇడుపులపాయలో 51 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఆమెకు ఇచ్చారని.. ఇక, 15 మెగావాట్ల సామర్థ్యం గల ఎస్‌ఆర్‌ఎస్ జలవిద్యుత్ ప్రాజెక్టును ఆమెకు కేటాయించారని, 22.5 మెగావాట్ల సామర్థ్యం గల స్వస్తిక్ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ఆమెకే ఇచ్చారని వివరించారు.

రామచల్లు బయట పెట్టిన లెక్కలు
అదే విధంగా విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటాను షర్మిలకు ఇచ్చారని రాచమల్లు వెల్లడించారు. అలాగ పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల భూమిని ఆమెకు అందించారని, ఇక విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100 శాతం వాటాను ఆమెకు ఇచ్చారని చెూ్పపారు. కాగా, రైల్వే కోడూరులో ఉన్న రాజారెడ్డి పాత ఆస్తిని కూడా షర్మిలకు ఇచ్చారని చెప్పారు. ఇక రైల్వే కోడూరులోని సెట్టిగుంటలో ఉన్న 90 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా వైఎస్ఆర్ షర్మిలకు ఇచ్చారని చెప్పిన రాచమల్లు... ఇవన్నీ షర్మిలకు వైఎస్సార్ నుంచి నేరుగా దాఖలు పడ్డ ఆస్తులుగా వెల్లడించారు. వైఎస్సార్ మాత్రమే కాకుండా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి కూడా షర్మిల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించారని రాచమల్లు పేర్కొన్నారు. షర్మిల విభేదించి పూర్తిగా విడిపోయేంత వరకు కూడా జగన్ తన సొంత సంపాదన నుండే పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఈ లిస్టు పైన షర్మిల ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
