తెలంగాణ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్‌ను తడిపిముద్ద చేసిన వాన!
తెలంగాణా రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, హైదరాబాద్‌తో సహా దక్షిణ, మధ్య తెలంగాణలో నవంబర్ 25 నుంచి 27 వరకు అక్కడక్కడా వర్షాలు పడతాయి. ఆ తర్వాత వాతావరణం మారనుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉండొచ్చని అంచనా. అంటే వానలు తగ్గగానే ఉష్ణోగ్రతలు పడిపోయే సూచనలున్నాయి.

ఇదిలా ఉంటె శుక్రవారం తెల్లవారే సరికి హైదరాబాద్ నగరం వానలో తడిసిపోయింది. గురువారం అర్ధరాత్రి మొదలైన జల్లులు ఉదయం వరకూ ఆగకుండా కురవడంతో, నగరంలో చాలాచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవటం ఉదయం ఆఫీసులకు, స్కూళ్లకు బయల్దేరిన వారికి పెద్ద అడ్డంకిగా మారింది.
నగరం తూర్పు నుంచి పడమర వరకు వర్షం విస్తరించింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వరకు ఎడతెగని జల్లులు పడ్డాయి. అలాగే ఐటీ కారిడార్ పరిసరాలైన గచ్చిబౌలి, మణికొండతో పాటు టోలిచౌకి, మేడ్చల్ ప్రాంతాల్లోనూ వాన కొనసాగింది. కంటిన్యూగా కురిసిన వానతో నాలాలు, మురుగు కాలువలు నిండి పొంగాయి.
దాంతో లోతట్టు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల రోడ్లు చిన్న చెరువుల్లా కనిపించాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి, పలు కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ఇలాంటి సమయంలో నగరవాసులు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. నీరు నిలిచిన రోడ్లలో వాహనాలు నడపకపోవడం, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపడిన విద్యుత్ తీగల దగ్గరికి వెళ్లకపోవడం ముఖ్యం. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం, ప్రయాణానికి ముందు ట్రాఫిక్ పరిస్థితి చూసుకోవడం మేలు. నీరు చేరిన కాలనీల వారు జీహెచ్ఎంసీ సహాయం కోసం సంబంధిత హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications
