కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
పార్లమెంట్ శీతాకాల ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదింపజేసుకోవడం అధికార పక్షానికి ఓ సవాల్ గా మారింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల స్పష్టమైన మెజారిటీ అవసరం. దీన్ని అందుకోవడంలో ఎన్డీఏ సంఖ్యాబలం చాలట్లేదు.
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 540 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు అవసరమౌతుంది. అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు ఆమోదానికి 360 ఓట్లు సరిపోతాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వద్ద ప్రస్తుతం 320 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. అంటే.. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే సరిగ్గా 40 ఓట్ల వెనుకంజలో ఉంది.. ఎన్డీఏ.

ఈ సమీకరణాల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్ వర్గం), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు, వాటి వైఖరి అత్యంత కీలకంగా మారింది. లోక్‌సభలో డీఎంకేకు 22 మంది సభ్యుల బలం ఉంది. ఎన్సీపీ (ఎస్పీ)- 8, వైఎస్ఆర్సీపీ- 4 మంది ఎంపీలు ఉన్నారు. ఈ మూడు పార్టీల మొత్తం సభ్యుల సంఖ్య 34. ఈ మూడు కూడా బిల్లుకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఎన్డీఏ బలం 354కి మాత్రమే చేరుతుంది. ఇంకా ఆరు ఓట్లు తక్కువే అవుతాయి.
ఈ మూడింట్లో అత్యధిక సీట్ల సంఖ్య ఉన్న డీఎంకే ఓటింగ్ కు దూరంగా ఉంటే అప్పుడు మొత్తం సీట్ల సంఖ్య 518కి చేరుతుంది. ఇందులో రెండింట మెజారిటీని పరిగణనలోకి తీసుకుంటే బిల్లు ఆమోదం పొందడానికి 346 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏకు 332 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డీఎంకేతో పాటు ఎన్సీపీ (ఎస్పీ) కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోతే అప్పుడు సభలో మొత్తం సభ్యుల సంఖ్య 510కి పడిపోతుంది. మెజారిటీ మార్క్ 340 అవుతుంది. అయినప్పటికీ ఎన్డీఏకు 324 ఓట్లే వచ్చే అవకాశం ఉన్నందున 16 ఓట్ల కొరత వెంటాడుతుంది.
ఇదివరకు ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో కూడా 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించని విషయం తెలిసిందే. అప్పట్లో ఈ బిల్లు వీగిపోయింది. ఆ సమయంలో 528 మంది సభ్యులు ఈ బిల్లుపై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 352 ఓట్లు రావాల్సి ఉండగా 298కే పరిమితం కావడంతో బిల్లు అప్పట్లో ఆమోదం పొందలేదు. 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది.
పార్టీలవారీగా బలాబలాలను చూసుకుంటే..
- బీజేపీకి సొంతంగా 241 మంది సభ్యుల బలం ఉంది. వీళ్లు కాకుండా..
- నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (తృణమూల్ నుంచి బయటికొచ్చిన ఎంపీలు)- 20
- తెలుగుదేశం పార్టీ- 16
- శివసేన- 13
- జనతాదళ్ (యునైటెడ్)- 12
- లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- 5
- రాష్ట్రీయ లోక్ దళ్- 5
- జనతా సమాజ్ వాది పార్టీ-2
- జనతాదళ్ సెక్యులర్- 2
- జనసేన- 2
ఎన్సీపీ, శిరోమణి అకాలీదళ్, అస్సాం గణపరిషత్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, అప్నాదళ్ (ఎస్), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చాలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపీలు ఉన్నారు. వీరందరూ ఎన్డీఏలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్డీఏ బలం 325కి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications
