Moral Stories: కుండలో పుచ్చకాయ.. అక్బర్ మనసు గెలుచుకున్న బీర్బల్..
చక్రవర్తి అక్బర్.. తనకెంతో ఇష్టమైన మంత్రి బీర్బల్ పై కోపంతో ఊగిపోయాడు. కోపంతో బీర్బల్ ను రాజ్యం విడిచిపెట్టి పోవాలని ఆదేశించాడు. రాజు ఆదేశాల మేరకు బీర్బల్ రాజ్యం విడిచిపెట్టి దూరంగా వెళ్లి ఓ మారుమూల గ్రామంలో తన వివరాలు ఎవరికీ చెప్పకుండా కాలం వెళ్లదీయసాగాడు. అలా ఆ గ్రామంలోని ఓ రైతు పొలంలో పనివాడిగా చేరాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత బీర్బల్ లేని లోటు అక్బర్ కు తెలిసింది. రాజ్యంలోని అనేక సమస్యలకు బీర్బల్ సలహాలు లేకుండా అక్బర్ పరిష్కరించలేకపోతున్నాడు. దాంతో బీర్బల్ ఆచూకీ కనిపెట్టి ఎక్కడున్నా తీసుకురావాలని సైనికులను ఆదేశించాడు అక్బర్.
ఇక బీర్బల్ ను వెతుక్కుంటూ సైనికులు వెళ్లసాగారు. అయితే ఎంత వెతికినా బీర్బల్ జాడ తెలియలేదు. దాంతో చక్రవర్తి అక్బర్ ఓ ఉపాయం ఆలోచించాడు. వెంటనే రాజ్యంలోని ప్రతి గ్రామ పెద్దకు సందేశం పంపాడు. " ప్రతి గ్రామం నుంచి తెలివితేటలతో నిండిన కుండను చక్రవర్తికి పంపించాలి. అలా సాధ్యం కాకపోతే ఆ కుండలో వజ్రాలు, రత్నాలతో నింపి పంపించాలి" అని సందేశం ఇచ్చాడు. అయితే ఈ సందేశం బీర్బల్ నివసిస్తున్న గ్రామానికి కూడా చేరింది. ఇక "తెలివితేటలతో కుండను ఎలా నింపి పంపించగలం.. అలాగే కుండలో నిండేంత బంగారం, రత్నాలు మన దగ్గర ఎక్కడున్నాయి." అని గ్రామస్థులంతా ఒక చోట చేరి మాట్లాడుకోవడం ప్రారంభించారు.
అప్పుడు అక్కడే గ్రామస్థుల వద్ద ఉన్న బీర్బల్ ఇలా అన్నాడు. "ఆ కుండను నాకు ఇవ్వండి.. నెల రోజుల్లో దాన్ని తెలివితేటలతో నింపి ఇస్తాను" అని అన్నాడు. దాంతో అతనికి ఒక అవకాశం ఇద్దామని గ్రామస్థులంతా ఆ కుండను బీర్బల్ కు ఇచ్చారు. ఇక బీర్బల్ ఆ కుండను తీసుకుని పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే బీర్బల్ పొలంలో పుచ్చకాయ మొక్కలు పెరిగాయి. వాటిలో చిన్న పుచ్చకాయ మొక్కను తీసుకుని దాన్ని తీగ నుంచి కోయకుండా కుండలో పెట్టి రోజూ నీళ్లు, ఎరువులు పెట్టసాగాడు. అలా పుచ్చకాయ కుండలోనే పెరిగి కుండ పరిమాణం అంత అయింది. ఆ పుచ్చకాయను బయటకు తీయడం అసాధ్యంగా మారింది. ఇక ఆ పుచ్చకాయ పూర్తిగా పెరిగిన తర్వాత తీగ నుంచి పుచ్చకాయను వేరు చేశాడు.
అనంతరం ఓ సందేశంతో పుచ్చకాయ కుండను చక్రవర్తి బీర్బల్ కు పంపించాడు. " మహారాజా.. ఈ పుచ్చకాయను కుండను పగలగొట్టకుండా.. పుచ్చకాయను కోయకుండా కుండలోంచి బయటకు తీయండి" అని సందేశం పంపాడు. ఇక ఆ కుండలోని పుచ్చకాయను చూసి అక్బర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీనిని ఇంత తెలివిగా ఆలోచించగలిగేది తన ప్రియమైన మంత్రి బీర్బల్ మాత్రమేనని గుర్తించాడు. వెంటనే ఆనందంతో అక్బర్ ఆ గ్రామానికి వెళ్లి బీర్బల్ ను స్వయంగా ఆహ్వానించాడు. దాంతో మరోసారి అక్బర్ మనసును బీర్బల్ గెలుచుకున్నాడు.

నీతి: సమస్య ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తెలివిగా పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు.












Click it and Unblock the Notifications
