ఇండియన్ ఆర్మీ చేతికి 'భార్గవాస్త్ర'.. పాకిస్థాన్ డ్రోన్ లు బూడిదే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఇక భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో పలు రంగాల్లో పాకిస్థాన్, చైనా మధ్య సత్సంబంధాలు మరింతగా బలపడ్డాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింతగా మెరుగుపరుచుకుంటోంది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అయితే తాజాగా భారత అమ్ముల పొదిలోకి "భార్గవాస్త్ర" వచ్చి చేరింది. శత్రు దేశాల డ్రోన్ లను క్షణాల్లో బూడిద చేసేందుకు వీలుగా భారత్ స్వదేశీ సాంకేతికతతో ఈ భార్గవాస్త్రను తీసుకొచ్చింది. ఈ మేరకు నవంబర్ 20 నుంచి 24 వరకు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో నిర్వహించిన పరీక్షల్లో విజయవంతం అయింది. దాంతో భారత సైన్యానికి ఈ భార్గవాస్త్ర వ్యవస్థను అందించేందుకు మార్గం మరింత సుగమమైంది.
ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తునాతునకలు చేసేందుకు వీలుగా భార్గవాస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థ ఈ డ్రోన్ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది వాహనాలపై అమర్చగల ఒక మొబైల్ వ్యవస్థ. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను అవసరమైన చోటుకు తీసుకెళ్లి అక్కడినుంచి డ్రోన్ లను అడ్డుకునే సామర్థ్యం ఈ భార్గవాస్త్ర సొంతం. అలాగే శత్రు దేశాల నుంచి వస్తున్న అనేక డ్రోన్ లను ఒకేసారి ఎదుర్కొనగలిగే సామర్థ్యం దీనికి ఉంది.

ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థలో అత్యాధునిక సెన్సార్లు ఉన్నాయి. వాటి ద్వారా పగలు, రాత్రి సమయాల్లో డ్రోన్ లను సులభంగా గుర్తించి వాటిని నేలకూల్చుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ భార్గవాస్త్ర వ్యవస్థ భారత సైన్యానికి ఎంతో కీలకం కానుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఈ వ్యవస్థ భారత సైన్యం చేతికి రానుంది. తొలుత మూడు దశల్లో పరీక్షలు పూర్తి కాగా తాజాగా మరో నాలుగు రోజులపాటు పోఖ్రాన్ లో పరీక్షలు నిర్వహించారు. అవి కూడా విజయవంతం కావడంతో భారత సైన్యం సంతృప్తి వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications
