మటన్ లివర్ తింటే రక్తం, బలం.. వారానికి ఒక్కసారి చాలు, వీరు మాత్రం తినొద్దు!
వారాంతం వస్తే మాంసాహార ప్రియుల వంటిళ్లు ఘుమఘుమలాడతాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో పాటు మేక శరీరంలోని తలకాయ, కాళ్లు, బోటీ, కాలేయం వంటి భాగాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వీటన్నింటిలో విభిన్నమైన రుచి, అపారమైన పోషకాలతో ప్రత్యేకంగా నిలిచేది మటన్ లివర్. శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ఇందులో దండిగా ఉన్నాయని, దీన్ని తింటే శరీరం బలం పుంజుకుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మటన్ లివర్‌లో ఇనుము మెండుగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని నాణ్యమైన ప్రోటీన్లు కణజాలాల మరమ్మతుకు, జీవక్రియలు సక్రమంగా సాగడానికి సహాయపడతాయి. కళ్లకు, నరాలకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది. అలాగే ఆహారంలోని ఐరన్ ను శరీరం సులభంగా గ్రహిస్తుంది.

కోలిన్, ఫోలేట్ విటమిన్ బి9 వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. గర్భిణులకు ఫోలేట్ చాలా అవసరం. ఇది శిశువు ఎదుగుదలకు, పుట్టుకతో వచ్చే లోపాల నివారణకు ఉపయోగపడుతుంది. అయితే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తినకూడదు. వారానికి ఒకసారి, ఒక్కోసారి 100 గ్రాములకు మించకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గౌట్, కీళ్ల వాపు సమస్య ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. లివర్‌లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణులు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించాలి. మటన్ లివర్‌లో ఉండే ఇనుము "హీమ్ ఐరన్" రకానికి చెందినది. మొక్కల నుంచి వచ్చే ఇనుముతో పోలిస్తే ఇది శరీరంలోకి బాగా ఇంకుతుంది.
అయితే విటమిన్ ఎ శరీరంలో నిల్వ ఉండే విటమిన్ కావడంతో, తరచూ ఎక్కువ లివర్ తింటే అది విషప్రభావం చూపవచ్చు. గర్భిణులు దీన్ని ఎక్కువగా తీసుకుంటే శిశువుకు హాని కలగవచ్చని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తాయి. అలాగే లివర్‌లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచి, గౌట్ నొప్పిని ఎక్కువ చేసే అవకాశం ఉంది.
వండే విధానం కూడా ముఖ్యమే. తాజా లివర్‌ను కొనుక్కుని, బాగా కడిగి, లోపల పచ్చిగా లేకుండా పూర్తిగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని లివర్ వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంటుంది. కొన్న వెంటనే ఫ్రిజ్‌లో ఉంచి, త్వరగా వండుకోవడం మంచిది. రక్తహీనత ఉందనే అనుమానం ఉంటే కేవలం ఆహారంపై ఆధారపడకుండా రక్త పరీక్ష చేయించుకుని, వైద్యుల సూచన ప్రకారం చికిత్స తీసుకోవాలి.












Click it and Unblock the Notifications
