కసబ్ లాయర్లకు ఇంకా అందని ఫీజు? 26/11 దాడులకు 18 ఏళ్లు..!
2008లో అరేబియా సముద్రం నుంచి పడవలో వచ్చిన పాకిస్తాన్ ముష్కరులు ముంబై మహానగరంలో బీభత్సం సృష్టించారు. వరుస బాంబుపేలుళ్లతో రెచ్చిపోయారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సకాలంలో స్పందించి ఎదురుదాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురు తీవ్రవాదుల్ని కాల్చిచంపేశారు. అయితే దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ (Ajmal Kasab) అనే తీవ్రవాదిని మాత్రం భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దీంతో ప్రపంచానికి పాకిస్తాన్ అసలు రూపాన్ని చూపించేందుకు భారత్ కు మంచి అవకాశం లభించింది. అయితే అజ్మల్ కసబ్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టాక ఆయన తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇద్దరు లాయర్లను కసబ్ కు మద్దతుగా వాదించేందుకు నియమించింది. హైకోర్టు నామినేట్ చేసిన ఈ ఇద్దరు లాయర్లు అమిన్ సోల్కర్, ఫర్హానా షా. వీరిద్దరూ అజ్మల్ కసబ్ కు మద్దతుగా డిఫెన్స్ తరఫున వాదనలు వినిపించారు. అయితే కసబ్ కు వ్యతిరేకంగా పలు సాక్ష్యాలు ఉండటంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత పూణే ఎరవాడ సెంట్రల్ జైల్లో ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఇది జరిగి రెండు దశాబ్దాలు కావస్తోంది. అయినా కసబ్ తరఫున వాదించిన ఆ ఇద్దరు లాయర్లకు మాత్రం పారితోషికంగా ఇవ్వాల్సిన లాయర్ ఫీజును ఇప్పటివరకూ చెల్లించలేదని తెలుస్తోంది.

2010లో హైకోర్టు సిఫార్సుతో నియమించిన ఈ ఇద్దరు లాయర్లకు రోజుకు రూ.1500 నుంచి 2 వేల రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంది. కానీ హైకోర్టు విచారణ పూర్తయి కసబ్ కు ఉరిశిక్ష పడిన తర్వాత కూడా ఇప్పటికీ తమకు రావాల్సిన ఫీజును మహారాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ చెల్లించడం లేదని వీరిలో ఒకరైన అమిన్ సోల్కర్ పీటీఐకి తెలిపారు. ఈ మేరకు తాము పలుమార్లు ఈ ఫీజు చెల్లించాలని కోరినా స్పందన లేదని పేర్కొన్నారు. తమకు అధికారికంగా అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా ఇచ్చారని, అయినా ఇంకా ఫీజు చెల్లించకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉండిపోతోందో తెలియడం లేదని ఆయన వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంపై వారు తిరిగి బోంబే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications
