Cyclone Akvan: ఏ తీరానికి అక్వాన్ తుఫాన్ ? అరేబియా-బంగాళాఖాతం మధ్య పోటీలో ..!
దక్షిణాది తీర ప్రాంతాన్ని వణికిస్తుందని భావిస్తున్న అక్వాన్ తుఫాన్ గమనం ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా సాయంత్రానికి తుఫానుగా (Cyclone Akvan) బలపడే అవకాశం ఉంది. ఇది రేపటికి తీవ్ర తుఫాన్ గా మారుతుందని అంచనా. దీని ప్రభావంతో ఏపీలో ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అంచనా వేస్తోంది. అయితే వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ తుఫాన్ గమనం ఎటువైపు మారుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సంచలన విషయం బయటపెట్టారు.
అక్వాన్ తుఫాను ఏపీ తీరానికి సమీపానికి చేరుకున్న తర్వాత రెండు అధిక పీడన మండలాల మధ్య చిక్కుకుపోయే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతపు అధిక పీడన ప్రాంతం దానిని ఉత్తరం వైపు లాగితే, అరేబియా అధిక పీడన ప్రాంతం దానిని దక్షిణం వైపు నెడుతుందని తెలిపారు. ఈ రెండింటిలో ఏది గెలిస్తే అది అటువైపు తీరాన్ని తాకుతుంది అనేది నిర్ణయించబడుతుందన్నారు. కాబట్టి దాని మార్గం మచిలీపట్నం నుండి చెన్నైకి దక్షిణంగా విస్తరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

#CycloneAkvan once reaching close to our coast can get stuck between two high-pressure zone. The Bay of Bengal ridge pulls it north, the Arabian ridge pushes it south. Whichever wins decides landfall, so the tracks forecast is spread from Machilipatnam to south of Chennai. https://t.co/73Fphn0jFM
— Andhra Pradesh Weatherman (@praneethweather) November 16, 2026
బంగాళాఖాతం అధిక పీడన ప్రాంతం (రిడ్జ్) ఈ తుఫాన్ ను ఉత్తరం వైపుకు లాగుతుందని, అలాగే అరేబియా అధిక పీడన ప్రాంతం (రిడ్జ్) తుఫానును దక్షిణం వైపుకు నెడుతుందని తెలిపారు. ఇప్పుడు ఈ రెండింటి బలం సమానమని, అందుకే తుఫాన్ ఈ రెండు ప్రాంతాల మధ్యలో చిక్కుకుందని వెల్లడించారు. తర్వాతి దశలో బంగాళాఖాతం రిడ్జ్ గెలిస్తే తుఫాన్ మచిలీపట్నం వైపుకు వస్తుందని, అలా కాకుండా అరేబియా రిడ్జ్ గెలిస్తే చెన్నైకి దక్షిణంగా ఇది పయనిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇది తీవ్ర తుఫాన్ గా మారిన తర్వాత ఎటువైపుకు వెళ్తుందన్నది నిర్ణయం అవుతుందన్నారు. అప్పటివరకూ ఏపీలోనే కచ్చితంగా ఇది తీరం దాటుతుందని చెప్పలేమని వెదర్ మ్యాన్ పరోక్షంగా వెల్లడించారు.













Click it and Unblock the Notifications
