"మా నీళ్లను జగన్ రెడ్డికి తాకట్టు పెడ్తివి కదా కేసీఆర్..!!"

పాలమూరు జిల్లా ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్‌ పదేళ్లపాటు పడావు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డగా ఈ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్‌ మన కృష్ణా జలాలను ఏపీ మాజీ సీఎం జగన్‌ రెడ్డికి తాకట్టు పెట్టడాని.. ఏపీ మాజీ మంత్రి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని, రాయలసీమ రత్నాల సీమా కావాలన్నారని దుయ్యబట్టారు. నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను ప్రారంభించారు. అలాగే త్వరలోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు.

అచ్చంపేటను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అడుగుతున్నారని.. నేనే ఈ గడ్డపై పుట్టిన బిడ్డను.. మీ బిడ్డగా చేయాల్సినంత అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నా రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరం ఒకవైపు.. మద్దిమడుగు ఆంజనేయుడు మరోవైపు.. తెలంగాణ అమరనాథ్ సలేశ్వరం ఇంకోవైపు.. అటు పౌరాణిక ప్రాశస్త్యానికీ.. ఇటు శాతవాహనులు, విష్ణుకుండినులు.. చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల నాయకులు.. బహమనీ, కుతుబ్‌షాహీ సుల్తానులు, నిజాంలు పరిపాలించిన చారిత్రక నేపథ్యం ఈ ప్రాంతం సొంతం.. చెంచు గిరిజనుల స్వచ్ఛమైన జీవనానికి.. ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతానికి పుట్టినిల్లు అచ్చంపేట అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నా పుట్టినిల్లు అచ్చంపేట ఒక గొప్ప వరం

అచ్చంపేటలో అడుగుపెడితే.. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్‌ను ఎదిరించి నిలిచి గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. దక్షిణ భారతదేశ ఝాన్సీ లక్ష్మీరాణి అచ్చమాంబ వీరత్వం గుర్తుకొస్తుందని.. వీరవనిత అచ్చమాంబ పేరుతో రూపుదిద్దుకున్న అచ్చంపేట ఇప్పటికీ అదే వారసత్వాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఆనాటి రాణి అచ్చమాంబ తరహాలోనే ఇందిరాగాంధీ స్ఫూర్తితో మా ప్రజా ప్రభుత్వం గడచిన మూడేండ్లుగా పరిపాలన కొనసాగిస్తోందని.. ఆమె స్ఫూర్తితోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

ఇక అధికారంలో ఉంది కాబట్టే బీజేపీ బతికి ఉంది..అధికారం కోల్పోతే బీజేపీ చచ్చిన పాముతో సమానం.. అధికారం కోల్పోయిన కేసీఆర్ జనంలోకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకుంటాడట.. కొడుకుకు అల్లుడికి, బిడ్డకు దోచిపెడతాడట.. అధికారం లేకపోతే ప్రజల్లోకి రాడట.. ప్రజా సమస్యలు ప్రస్తావించడట.. ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటున్న కేసీఆర్ ప్రజల్లోకి రాడట.. ఆయన్ను ఎలా శిక్షించాలో మీరే చెప్పండని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే అప్పుల రాష్ట్రంగా మార్చారు. 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణను దివాళా తీయించారు. మూడేళ్లలో 1 లక్ష 78 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసి రైతుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పదేళ్లు కేసీఆర్ పడావు పెట్టారు. పాలమూరు బిడ్డలను నిండా మోసం చేసి కృష్ణా నదిలో ముంచిండు. మీ రేవంతన్నగా ఈ పాలమూరును కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు.

పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మా నీళ్లను జగన్ రెడ్డికి తాకట్టు పెడితివి కదా కేసీఆర్.. ఒక్క పూట రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తానని చెప్పావ్ కదా.. అచ్చంపేట లిఫ్ట్ ను పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు నీరు అందేది.. నీళ్లు రాయలసీమకు పోతున్నాయని మాట్లాడుతున్నావ్.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి నెలకొదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

పాలమూరు, అచ్చంపేట, డిండి పూర్తయి ఉంటే మాకు నీళ్లు వచ్చేవి కాదా.. అటు పక్క ఆంధ్రా వాళ్లు జల దొంగల్లా పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులతో నీళ్లు తరలించుకు పోతుంటే నువ్వేం చేశావ్ కేసీఆర్.. 811 టీఎంసీల నీళ్లుంటే తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది మామ అల్లుళ్లు.. ఆంధ్రా 66 శాతం నీళ్లు తీసుకోవచ్చని సంతకం చేసింది ఈ ద్రోహులు.. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగింది కేసీఆర్ వైఎస్ఆర్ మోచేతి నీళ్లు తాగింది హరీష్ రావు.. హరీష్ రావుకు నిజమైన గురువు కేసీఆర్ కాదు..వైఎస్ఆర్ అని స్పష్టం చేశారు.

హరీష్ ను మంత్రిని చేసింది వైఎస్ఆర్

వార్డు మెంబర్ కూడా కాని హరీష్ ను మంత్రిని చేసింది వైఎస్ఆర్.. అందుకే జగన్ ను హరీష్ ఒక్క మాట కూడా విమర్శించరు. మా ప్రభుత్వం పోయిన ఏడాది ఆడబిడ్డలకు పాలపిట్ట రంగు చీరలు ఇచ్చాం. ఇప్పుడు అచ్చంపేట వేదికగా ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు చీర ఇస్తున్నాం.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న మాకు.. సొంత చెల్లికి ద్రోహం చేసిన ఆ ద్రోహికి.. పులికి నక్కకు ఉన్నంత తేడా ఉంది. నాలో ఉన్నది పాలమూరు బిడ్డల పౌరుషం. త్వరలోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది మీ సోదరుడు రేవంత్ రెడ్డి.. కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచి మోదీకి సవాల్ విసిరింది మీ రేవంతన్న కాదా..? బండి సంజయ్, రాంచందర్ రావు, కిషన్ రెడ్డి ఎంత లేపినా బీజేపీ లేవదు. ఇవాళ వాళ్లు కూడా అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. మా మీటింగ్ లో పల్లి బటానీలు అమ్ముకోవడం తప్ప బీజేపీ చేసేదేం లేదు. బీఆర్ఎస్ కూడా ఇక అప్పుడే మళ్లీ వచ్చేస్తామని కలలు కంటున్నారని అన్నారు.

CMRevanth You mortgaged our waters to Jagan Reddy didn t you KCR CM Revanth Reddy remarks

2034 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం

గడ్డం పెంచుకున్న ప్రతీ అడ్డగాడిద రేవంత్ రెడ్డి కాలేరు. ఏమిచ్చారని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామంటోంది? మేం చేసిన సంక్షేమం గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం, చెప్తే భారతం.. బీజేపీ, బీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నా.. మీరు విడివిడిగా రాకండి.. కలిసి రండి.. అసెంబ్లీలో మీ లెక్క తెలుస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ కుటుంబాలకు సంక్షేమం అందిస్తున్నాం.. అది మాకు ఇందిరమ్మ ఇచ్చిన వారసత్వం.. పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే మాకు తెలిసింది.. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+