నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ: డీలిమిటేషన్ బిల్లుపై..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కేబినెట్ కీలక భేటీకి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డీలిమిటేసన్, మహిళా రిజర్వేషన్ తో కూడిన సవరణల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును లోక్ సభ, రాజ్యసభల సమక్షానికి తీసుకువచ్చి ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉంది కేంద్ర ప్రభుత్వం.
లోక్‌సభ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశం కానుంది. డిసెంబర్ 3వ తేదీతో ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఉభయసభలను కూడా సమావేశ పర్చబోతోందనేది స్పష్టమౌతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఈ తేదీలను ప్రకటించిన కొద్దిసేపటికే కేంద్ర కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడయ్యాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత సేవా తీర్థ్ లో ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ సమాచారం అందుకోవడంతో వివిధ రాష్ట్రాల్లో పర్యటనల్లో ఉన్న మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈ సమావేశానికి మంత్రులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి వారందరికీ కూడా. వచ్చే వారం జరగాల్సిన విదేశీ పర్యటనలను సైతం కొందరు మంత్రులు వాయిదా వేసుకున్నారు.
సాధారణంగా వారానికి ఒకసారి మాత్రమే సమావేశమయ్యే కేంద్ర మంత్రిమండలి, ఒకే వారంలో రెండుసార్లు భేటీ కావడం అత్యంత అరుదు. దీంతో అందరి చూపులూ దీని మీదే నిలిచాయి. సాధారణ కేబినెట్ సమావేశం నిర్వహించిన రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ అత్యవసర భేటీని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ప్రత్యేక సమావేశాలకు ముందు ఈ సమావేశం జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
