పట్టు సడలుతోంది, సీన్ ఛేంజ్ - తేల్చేసిన పంచాయితీ ఫలితాలు..!!
ఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు రాకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినా కంచుకోటల్లో వచ్చిన ఫలితాలు ఆలోచనల్లో పడేసాయి. గ్రామాల్లో తమకు తిరుగులేదనే ధీమాతో ఉన్న వైసీపీకి షాక్ ఇచ్చాయి. రెబల్స్ సైతం తమ సత్తా చాటుకున్నారు. అయితే, రాజకీయంగా కీలకంగా భావించే జిల్లాల్లో ఫలితాలు మాత్రం కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నాయి. ఈ ఫలితాలు విశ్లేషణల్లో ఆసక్తి కర అంశాలు బయటకు వస్తున్నాయి.
తొలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తిగా వచ్చాయి. తొలి దశలో ఎన్నికలు జరిగిన 3949 పంచాయతీల్లో 760 పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. కాగా. ఇప్పుడు తుది ఫలితాల్లో కూటమి - 2539 స్థానాలను దక్కించుకుంది. అందులో టీడీపీ- 2325, జనసేన -189, బీజేపీ - 25 స్థానాల్లో విజయం సాధించింది. ఈ పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్ధులు గెలుపొందారు. కాగా.. వైసీపీ - 1,110 స్థానాలను దక్కించుకుంది. ఇక.. ఇతరులు - 294 స్థానాలు గెలుచుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ.. పంచాయతీ ఎన్నికల్లో ఆ జోరు కొనసాగించింది. మొత్తం 66 పంచాయతీలకు గాను 29 చోట్ల గెలిచింది. కూటమి 26 స్థానాలను కైవసం చేసుకుంది.

మారుతున్న లెక్కలు
కాగా, పరిషత్ ఎన్నికల్లో కూటమి దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన తిరుపతి జిల్లాలో.. 404 పంచాయతీల కు గాను వైసీపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు. టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న కృష్ణా లో పంచాయితీల్లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. గన్నవరం నియోజకవర్గంలోనూ వైసీపీ ఆధిక్యత కొనసాగింది. ఏలూరు లోనూ వైసీపీ బలం చాటుకుంది. రాయలసీమ జిల్లాల్లో తిరుపతి మినహా మిగిలిన చోట్ల కూటమి ఆధిక్యత కొనసాగింది. జగన్ సొంత గ్రామం బలపూరు సైతం టీడీపీ మద్దతు దారు గెలిచారు. కాగా, తొలి విడత ఫలితాల పైన కూటమి, వైసీపీ నేతల్లో విశ్లేషణలు మొదలైంది. ఏ ఎన్నిక అయినా ప్రజలు తమ వైపే ఉన్నారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక, వైసీపీ మాత్రం అధికారంలో ఉన్న పార్టీలు ఎన్ని అడ్డంకులు కలిగించినా.. గ్రామాల్లో తమ పట్టు సడల లేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. దీంతో, మిగిలిన రెండు విడతల ఎన్నికలు.. గెలుపు ఇప్పుడు రెండు వైపులా మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications
