షేక్ హసీనా చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. !!
ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా డిసెంబరు 16వ తేదీన భారత్ నుంచి తిరిగి స్వదేశానికి చేరుకుంటారనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆ దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే షేక్ హసీనాకు చెందిన అత్యంత సన్నిహితులు, ఆమె ప్రభుత్వంలో పని చేసిన మాజీ అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది.
తాజాగా హసీనా మాజీ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కేఎమ్ షాఖావత్ మూన్, మాజీ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ ఇలియాస్ హుస్సేన్, ఆదాయపు పన్ను న్యాయవాది సూఫీ మహమ్మద్ అల్ మామున్‌లను పోలీసులు ఢాకాలో అరెస్టు చేశారు. ఢాకా వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తోన్నారనే కారణంతో బీఎన్‌పీ విద్యార్థి విభాగం జాతీయతావాది ఛాత్ర దళ్ నాయకులు మొదట వీరిని అడ్డుకున్నారు. అనంతరం మహమ్మద్‌పూర్ పోలీసులకు అప్పగించారు.

ఈ అరెస్టులతో పాటు అటు పోలీసు శాఖలోనూ ప్రక్షాళన వేగవంతమైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు మహమ్మద్ అబుల్ కలామ్ ఆజాద్, మహమ్మద్ రకీబుల్ హసన్‌లను గాజీపూర్, నోవాఖాలీల్లో అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నిస్తోన్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో చోటు చేసుకున్న నిరసనలు, మారణకాండకు ఆమెను బాధ్యురాలిని చేసింది ప్రత్యేక ట్రైబ్యునల్. ఆమెకు మరణశిక్ష విధించింది. తదనంతరం ఆమె భారత్ కు చేరుకున్నారు. ఇక్కడే తలదాచుకుంటోన్నారు. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతుండగా, ఆ ప్రతిపాదనను భారత్ పరిశీలిస్తోంది.
ప్రస్తుతం హసీనా స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఆమె ఢాకా వెళ్లనున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ నెల ప్రారంభం నుండి బంగ్లాదేశ్‌లో రైళ్లు, బస్సులు, బ్యాంకులపై పెట్రోల్ బాంబుల దాడులు, పోలీసు స్టేషన్లను తగలేయడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసకర చర్యల వెనుక నిషేధిత ఆవామీ లీగ్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 108 ప్లాటూన్ల పారామిలటరీ బలగాలను మోహరింపజేసిందక్కడి ప్రభుత్వం. హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లోనే 56 ప్లాటూన్ల బలగాలను రంగంలోకి దింపిందంటే.. పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షేక్ హసీనా రాక గడువు దగ్గరపడుతున్న కొద్దీ బంగ్లాదేశ్‌లో రాజకీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొంటోది.












Click it and Unblock the Notifications
