అధిక రక్తపోటు చికిత్సలో తెలంగాణ ఇతర దేశాలకు రోల్ మోడల్.. వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ!
హైపర్ టెన్షన్, మధుమేహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలుగా మారాయి. వీటిని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం కృషి చేస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధిక రక్తపోటును కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో బంగ్లాదేశ్ తో పాటు నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దక్షిణాసియా దేశాలకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు ఒక నమూనాగా మారుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా దేశాల ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన క్రమంలో కొన్ని జిల్లాలలో ఆరోగ్య ఉప కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి హైబీపీ నియంత్రణ చర్యలను అధ్యయనం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వీటిని త్వరలో కొన్ని దక్షిణాసియా దేశాల్లో కూడా అమలు చేయనున్నట్టు డబ్ల్యూ హెచ్ సభ్యులు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేశారు.

భవిష్యత్తులో వారికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధిక రక్తపోటు మధుమేహం బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిపి బాధితులు 20 లక్షలకు పైగా ఉన్నారని, మధుమేహం బాధితులు 10 లక్షలు పైనే ఉన్నట్టు నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో హైరిస్క్ ఉన్న వారి వివరాలను ఏఎన్ఎంలు సేకరించి ప్రతినెల వారికి ఫోన్ చేస్తూ మందులు వాడాలని గుర్తు చేస్తున్నారు.
అలా సుమారు మూడు నెలల పాటు వారిని ఫాలో అప్ చేస్తూ జబ్బుల నియంత్రణకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బీపీ మందులు తీసుకునే వాళ్ళ వివరాలు పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం గత సంవత్సరం నుండి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు, మధుమేహం పరీక్షలు కొనసాగిస్తున్నారు.
లక్షణాలు ఉన్న వారిని ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న టువంటి ఈ చర్యల పైన వారం రోజుల పాటు ఇక్కడే ఉండి అధ్యయనం చేసినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం అధిక రక్తపోటు కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని, త్వరలో మరికొన్ని దేశాలలో కూడా వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.














Click it and Unblock the Notifications
