డిసెంబరులో నామినేటెడ్ పోస్తుల భర్తీ: సీఎం, పీసీసీ చీఫ్‌తో కాంగ్రెస్ ఇన్‌చార్జి వరుస భేటీలు!
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా నెలలుగా నాన్చుతూ వస్తున్న నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల భర్తీపై మళ్లీ కదలిక మొదలైంది. ఈ ప్రక్రియను డిసెంబరులో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ కుమార్ ఒక అవగాహనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.
గురువారం ఈ విషయంపై వరుసగా చర్చలు జరిగాయి. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి ముందు ప్రజాభవన్ అతిథి గృహంలో సందీప్ కుమార్‌ను సీఎం కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీని బలోపేతం చేసే మార్గాలు, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని, ఇందులో పార్టీ యంత్రాంగం కీలకంగా వ్యవహరించాలని రేవంత్ సూచించినట్లు తెలిసింది.

ఇదే చర్చలో పార్టీలో ఖాళీగా ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార తదితర కమిటీలు, కార్యదర్శుల నియామకాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆశావహులందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదనే అభిప్రాయం నేతల్లో ఉంది. అందువల్ల కసరత్తును త్వరగా ముగించి డిసెంబరులోనే నియామకాలు ప్రకటించాలని భావిస్తున్నారు.ర్యాలీ ముగిసిన తర్వాత సందీప్ కుమార్ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో సుమారు గంటసేపు విడిగా సమావేశమయ్యారు.
అందులోనూ నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిందని సమాచారం. డిసెంబరు 15 తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమై రాబోయే ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయడం ఈ పర్యటనల లక్ష్యమని చెబుతున్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ 2024 సెప్టెంబర్ 15న టీపీసీసీ అధ్యక్షుడయ్యారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడిచినా కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం ఇంకా జరగలేదు. ఈ ఏడాది అక్టోబరులో దసరా నాటికి కార్పొరేషన్ పదవుల నియామకాలు ప్రకటిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. కానీ ఆ ప్రక్రియ తర్వాత వాయిదా పడింది, దాంతో ఆశావహుల్లో అసంతృప్తి పెరిగింది.
పదవుల పంపిణీలో ప్రాధాన్యం ఎవరికన్న దానిపై కూడా నాయకత్వం స్పష్టత ఇస్తూ వచ్చింది. ఆగస్టులో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, విధేయులైన పార్టీ కార్యకర్తలు, డీసీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కాబట్టి డిసెంబరులో భర్తీ చేస్తారా అని ఆశావహులు ఆశగా చూస్తున్నారు. పదవుల కోసం గాడ్ ఫాదర్ ల వద్దకు పరుగులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications
