విజయ్ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ ..! గవర్నర్ ను కోరిన ఉదయనిధి స్టాలిన్..!
తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే ఎమ్మెల్యేలపై ఆరోపణలు తీవ్ర స్ధాయికి చేరాయి. తాజాగా కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్య మెసేజ్ లు పంపిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం టీవీకే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండటంతో దీనిపై ప్రతిపక్ష డీఎంకే గవర్నర్ ను ఆశ్రయించింది. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ పై సీబీఐ విచారణ జరిపించాలని విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గవర్నర్ ను కోరారు.
ఇవాళ తమిళనాడు రాజ్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బృందం భేటీ అయింది. ఇందులో మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్ తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వీరు కళ్లకురిచి ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ కు అసభ్య సందేశాలు పంపిన వ్యవహారంతో పాటు కస్టడీలో జరిగిన తొమ్మిది మరణాలు, జింగీలో మైనర్ బాలిక అదృశ్యం, డ్రగ్స్ కేసులో టీవీకే కార్యకర్తల ప్రమేయం వంటి పలు అంశాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ పై సీబీఐ దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని ఉదయనిధి స్టాలిన్ గవర్నర్ ను కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ గవర్నర్ కు కళ్లకురిచ్చి ఎమ్మెల్యే వ్యవహారంంపై ఫిర్యాదు చేయడంతో పాటు సీబీఐ దర్యాప్తు కోరినట్లు వెల్లడించారు. సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని గవర్నర్‌ను కోరినట్లు ఉదయనిధి తెలిపారు. అంతేకాకుండా, ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పందించిన తీరును కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టీవీకే ఎమ్మెల్యేను కాపాడుతోందని, అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు ఉదయనిధి తెలిపారు. మరోవైపు బీజేపీ నియమించిన గవర్నర్ అంటేనే మండిపడే డీఎంకే నేతలు.. అదే గవర్నర్ వద్దకు వెళ్లి విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ కోరడం విశేషం.














Click it and Unblock the Notifications
