H-1B గ్రీన్ కార్డుల స్పాన్సర్ షిప్ పై IBM కీలక నిర్ణయం-మిగిలింది ఈ 2 దారులే..!
అమెరికాలో పనిచేస్తున్న భారత్ సహా విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డుల స్పాన్సర్ షిప్ విషయంలో ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించే గ్రీన్ కార్డుల స్పాన్సర్ షిప్ ను (Green Card Sponsorship) రద్దు చేయాలని ఐబీఎం నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐబీఎం తాజా నిర్ణయంతో అందులో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు రెండు దారులే మిగిలాయి.
ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా ఉద్యోగాలకు అమెరికా వీసా, గ్రీన్ కార్డు స్పాన్సర్ షిప్ నిలిపేసినట్లు బ్లూమ్ బెర్గ్ తాజాగా నివేదించింది. అనంతరం 'రెస్ట్ ఆఫ్ వరల్డ్'తన తాజా నివేదికలో వీసా లేదా గ్రీన్ కార్డుల స్పాన్సర్ షిప్ కోసం ఐబీఎంపై ఆధారపడిన విదేశీ ఉద్యోగులతో సహా ఈ నిర్ణయంతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. అవి కంపెనీలో మరో దేశంలో ఉద్యోగం వెతుక్కోవడం లేదా తమ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోవడం. వేరే దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడని వారికి మూడు నెలల పరిహారం ప్యాకేజ్ ఇస్తారు. కానీ వారి ఉద్యోగం డిసెంబర్ 31తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి వారికి మిగిలింది మూడు వారాలు మత్రమే.

అమెరికాలో దీర్ధకాలిక కెరీర్ కోసం వెళ్లిన భారతీయులకు స్వదేశానికి తిరిగి రావడం కంటే ఇతర దేశాలకు వెళ్లడమే సులువుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వెళ్లాల్సి వస్తే తమ జీతంలో 80 శాతం కోత పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంటే ఉద్యోగులు చాలా తక్కువ జీతంతో తమ ఉద్యోగాల్ని కాపాడుకోవడమా లేక తమ ప్రస్తుత ఉద్యోగాన్ని పూర్తిగా కోల్పోవడమా అనే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మారుతున్న నియామక అవసరాల కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఐబీఎం చెబుతోంది. అమెరికాలో నైపుణ్యాల కొరత కారణంగా ఐబీఎం అధిక నైపుణ్యం గల వీసా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటోంది. అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయాన్ని ఐబీఎం మార్చుకోవాల్సి వస్తోంది.














Click it and Unblock the Notifications
