పార్లమెంట్ సమావేశం, బిల్లుల పై మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం- ముహూర్తం..!!
పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పైన కొంత కాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఎట్ట కేలకు పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం జరిగింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్రం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పార్లమెంట్ భేటీ.. మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేంద్రం.. తాజాగా కేబినెట్ సమావేశంలో వీటి పైన చర్చించింది. మంత్రులకు ఇదే అంశం పైన మోదీ దిశా నిర్దేశం చేసారు.
పార్లమెంట్ సమావేశాలను డిసెంబర్ 15వ తేదీ లోగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను అధికారికంగా ప్రకటించనుంది. విదేశీ పర్యటనలు పక్కన పెట్టి, మంత్రులు ఇందుకు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదాపడి 103 రోజులైనా, ఇంకా ప్రొరోగ్ కాకపోవడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలని ప్రధాని సూచించారు. అయితే, ఈ సమావేశాలను వర్షాకాల సెషన్ కు కొనసాగింపుగా నిర్వహిస్తారా.. శీతాకాల సమావేశాల కోసం నిర్ణయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, వచ్చే నెలలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రం వ్యూహాత్మక నిర్ణయాలు
ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా మహిళా రిజర్వేషన్లు- డీ లిమిటేషన్ బిల్లులు కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఏప్రిల్ లో సభలో ప్రవేశ పెట్టిన డీ లిమిటేషన్ బిల్లు వీగిపోయింది. కాగా, ఇప్పుడు మరోసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించి ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్దం చేస్తోంది. డీఎంకే, సమాజ్ వాదీ, ఎన్సీపీ తో సహా ఆప్ ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రస్తుతం లోక్ సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 361 మంది మద్దతు ఇస్తేనే ఆమోదం సాధ్యం అవుతోంది. ఎన్డీఏ కు 320 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో.. మరో 41 మంది మద్దతు కోసం బీజేపీ ముఖ్య నేతలు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. పార్లమెంట్ సమావేశాల పై కేంద్రం అధికారికంగా చేసే ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
