కశ్మీర్‌లో పాక్‌కు గట్టి షాక్.. స్థానిక ఉగ్రవాదులు ఖతం.. 35 మందిపై వేట!
గత 37 ఏళ్లలో తొలిసారిగా కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఉనికి దాదాపు తుదిచిపెట్టుకుపోయింది. చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్ కూడా ఈ వారం ప్రారంభంలో ఎన్‌కౌంటర్‌లో హతం కావడంతో లోయలో స్థానిక ఉగ్రవాద ముఠాలు లేకుండా పోయాయి. దీంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతూ.. శీతాకాలంలో చొరబాటుకు కుట్రలు పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
సున్నాకు చేరిన స్థానిక నియామకాలు
స్థానికంగా ఉగ్రవాదంలో చేరే యువకుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గుతూ ఇప్పుడు సున్నాకు చేరింది. 2018లో 196 మంది స్థానిక యువకులు ఉగ్రవాద బాట పట్టగా.. 2021లో 146, 2022లో 121, 2023లో కేవలం 19, 2024లో 4, 2025లో ఒక్కరికి తగ్గింది. ఈ ఏడాది ఆ సంఖ్య సున్నాగా నమోదైంది. స్థానిక మద్దతు కనుమరుగు కావడంతో మంచు కురిసి కనుమలు మూసుకుపోయేలాగా పాకిస్థాన్ తన ఉగ్రవాదులను ఎల్‌ఓసీ దాటించేందుకు ప్రయత్నిస్తోంది. పీర్ పంజాల్‌కు ఉత్తరాన దాదాపు 35 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు చురుకుగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మారిన వ్యూహం.. ఆపరేషన్ సిందూర్ ప్రభావం
ఎల్‌ఓసీ వెంబడి పాకిస్థాన్ తన లాంచ్ ప్యాడ్లను తిరిగి చురగ్గా మార్చినప్పటికీ వ్యూహాన్ని మార్చుకుంది. పెద్ద బృందాలకు బదులుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదుల చిన్న బృందాలను చొరబాటుకు సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్‌లో బహావల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభాన్ అల్లా'సహా పలు కీలక ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన తర్వాత పాక్ ఈ కొత్త వ్యూహానికి తెరలేపింది. మరోవైపు శీతాకాలంలో ఉద్రిక్తతలను కొనసాగించేందుకు బార్డర్ యాక్షన్ టీమ్ దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
కట్టుదిట్టమైన భద్రత.. ఆస్తుల జప్తు
ఉగ్రవాదులు అడవులు, సహజ గుహల్లో తలదాచుకోకుండా భద్రతా దళాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఎత్తైన పర్వత ప్రాంతాలు, అటవీ బెల్ట్‌లలో ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేసేందుకు దాదాపు 100 తాత్కాలిక కార్యాచరణ స్థావరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పీర్ పంజాల్ కు దక్షిణాన పాత ఉగ్రవాద మద్దతు వ్యవస్థను దెబ్బతీసే చర్యలు కొనసాగుతున్నాయి. ఏళ్ల క్రితం పాకిస్థాన్ కు పారిపోయి అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు యత్నిస్తున్న వారి జాబితాను సిద్ధం చేశారు. వారు తమ భూములను విక్రయించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుకోకుండా స్వదేశంలోని వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
