చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. సంబరాలు చేసుకుంటున్న దేశ ప్రజలు
అంతరిక్ష రంగంలో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. చైనాకు చెందిన షెన్ జౌ24 మానవ సహిత అంతరిక్ష నౌకలో పాకిస్థాన్ కు చెందిన వ్యోమగామి మహమ్మద్ జీషన్ అలీ అంతరిక్షంలోని చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు విజయవంతంగా చేరుకున్నారు. ఈ మేరకు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పాకిస్థానీ వ్యోమగామిగా అలీ చరిత్ర సృష్టించారు.
అంతేకాక ఇప్పటివరకు తన సొంత వ్యోమగాములను మాత్రమే రోదసిలోకి పంపిన చైనా తొలిసారిగా ఒక విదేశీ వ్యోమగామికి తన అంతరిక్ష కేంద్రంలో చోటు కల్పించింది. షెన్ జౌ మిషన్ లో భాగంగా అలీతోపాటు చైనాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు కూడా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. వీరికి అక్కడ ఘన స్వాగతం లభించింది.
తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో అలీ దాదాపు వారం రోజుల పాటు ఉండి పలు శాస్త్రీయ, సాంకేతిక ప్రయోగాల్లో పాల్గొననున్నారు. ఆయన పేలోడ్ స్పెషలిస్ట్ గా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక చైనాకు చెందిన అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో వ్యోమగామి అలీకి ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక విందులో పాకిస్థానీ సంప్రదాయానికి అనుగుణంగా 100 కు పైగా వంటకాలు ఉన్నట్లు సమాచారం.

వాటీలో బీఫ్ నిహారీ, లాంబ్ కుర్మా, శనగల కూర ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు స్పష్టం అవుతోంది. ఇక వారం రోజుల స్పేస్ యాత్ర అనంతరం షెన్ జౌ 23 అంతరిక్ష నౌక ద్వారా తిరిగి అలీ భూమి మీదకు రానున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్థాన్ కు చెందిన వ్యోమగామి తొలిసారిగా అంతరిక్షంలో కాలు మోపిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ విజయంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. చైనా- పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహం హిమాలయాలను దాటి అంతరిక్షం వరకు చేరిందని స్పష్టం చేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో ఇది కీలకమైన మైలురాయి అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
