క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతి చర్చికి రూ. 30 వేలు సాయం
తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటి. ఏటా డిసెంబర్ 25న ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తుంటారు. అలా దాదాపు డిసెంబర్ మాసం మొత్తం క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుంటారు. డిసెంబర్ నెలను క్రైస్తవులు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తుంటారు. ఈ నెలలో ప్రతి రోజూ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ.
అయితే రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అర్హత పొందిన ప్రతి చర్చికి రూ. 30 వేలు సాయం చేయాలని నిర్ణయించింది. క్రిస్మస్ 2026 సందర్భంగా రాష్ట్రంతో పాటు జీహెచ్ ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని అర్హత పొందిన, రిజిస్టర్డ్ చర్చిలకు వైట్ వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.30 వేల చొప్పున నిధులను మంజూరు చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ మేరకు క్రైస్తవ సోదరులు తమ సమీపంలోని చర్చిల అభివృద్ధి కోసం నవంబర్ 23 నుంచి 30 వరకు TG-OBMMS పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత చర్చిలకు నిధుల కేటాయింపు నియోజకవర్గాల వారీగా జిల్లా అధికారులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న చర్చిలకు సాయం అందేలా కోటా విధానం అమలు చేయనున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.

దరఖాస్తులో భాగంగా చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మేనేజ్ మెంట్ కమిటీ తీర్మానం, చర్చికి సంబంధించిన బ్యాంక్ పాస్ బుక్, క్యాన్సిల్డ్ చెక్, పాస్టర్ లేదా అధ్యక్షుడి ఆధార్ కార్డుతోపాటు చర్చి తాజా ఫొటోలు, నిధులను కేవలం వైట్ వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసమే వినియోగిస్తామనే హామీ పత్రం జతచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా, గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తమ వంతు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
