"ఎవరినీ వదలొద్దు"- కడప కలెక్టర్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తాగునీటి పైప్‌లైన్ ధ్వంసం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై మీడియా కథనాలను తెప్పించుకున్న చంద్రబాబు.. తక్షణమే పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం కార్యాలయం జిల్లా అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు ప్రజల అవసరాలకు ఉద్దేశించిన తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని సీఎంఓ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, అక్రమ మైనింగ్‌కు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించవద్దని జిల్లా కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలపై స్పందించిన కడప జిల్లా కలెక్టర్, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సీఎంవోకు వెంటనే నివేదించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లి వద్ద ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారని కలెక్టర్ తెలిపారు. తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు అక్రమ తవ్వకాలను, ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లు, వాటి యజమానులు, ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారని... ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్యంగా తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులు, ట్రాక్టర్ యజమానులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశామని, దెబ్బతిన్న పైప్‌లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించామని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పెన్నా, చిత్రావతి నదీ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీఎంఓకు తెలిపారు. అక్రమ మైనింగ్‌ను కట్టడి చేసేలా జిల్లా, మండల స్థాయి కమిటీలను నియమించామన్నారు. పెన్నా, చిత్రావతి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత మండలాల తహసీల్దార్లు సమన్వయంతో పనిచేస్తూ చెక్‌పోస్టుల ద్వారా అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పెన్నా నది వెంబడి నిరంతర నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఇటువంటి అక్రమాలు, ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలను సీఎంఓ జిల్లా కలెక్టర్‌కు తెలిపింది.













Click it and Unblock the Notifications
