యోగీ ఆదిత్యనాథ్ కు చెక్ ? ఈసారి కొత్తవారికి? ఘాటుగా స్పందించిన సీఎం..!
పదేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ తర్వాత అనూహ్యంగా సీఎంగా ఎంపికైన యోగీ ఆదిత్యనాథ్ (yogi Adityanath) గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో ఆ పార్టీకి నమ్మకమైన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలు, బీజేపీలో పెరుగుతున్న అసమ్మతి నేపథ్యంలో ఈసారి యోగీని మార్చేందుకు పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. దీనికి ఆజ్యం పోసేలా ఆయన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తాజాగా వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్దిగా ఎవరిని నిలబెడుతుందన్న చర్చపై తాజాగా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఎన్నికల్లో కమలం మాత్రమే బీజేపీ ముఖచిత్రమని, ఎన్నికలు పూర్తయి, ఎమ్మెల్యేలు ఎన్నికయ్యాక వారు సమావేశమవుతారని, కేంద్ర పరిశీలకులు వస్తాయని, ఆ భేటీలో ఏకాభిప్రాయంతో ఓ నాయకుడిని ఎన్నుకుంటారని తెలిపారు. ప్రస్తుతం యోగీ ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారని, ఆయన కొనసాగుతారా లేక ఆయన స్ధానంలో మరొకరు ఆ బాధ్యత చేపడతారా అన్నది తాను నిర్ణయించేది కాదన్నారు. అది ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు యోగీకి మంటపుట్టించాయి.

పదేళ్లుగా సీఎంగా కొనసాగుతున్న తనను కాదని, మరొకరిని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించదన్న ధీమాతో ఉన్న యోగీ ఆదిత్యనాథ్.. వచ్చే ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్ధి ఎవరో అందరికీ తెలుసంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఒక్కరూ కమలం గుర్తుపైనే పోటీ చేయాల్సి ఉంటుందని, తాను కూడా కమలం గుర్తుపైనే పోటీ చేస్తానంటూ ఏబీపీ న్యూస్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తద్వారా డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య వ్యాఖ్యలకు యోగీ ఆదిత్యనాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మాటల యుద్దం ఎలా ఉన్నా బీజేపీ మాత్రం ఈసారి హ్యాట్రిక్ విజయం అందుకోవాలంటే కీలక మార్పులు చేయాల్సిందేనన్న డిమాండ్లు మాత్రం భారీ ఎత్తున వినిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
