త్వరలో బంగ్లాదేశ్ ను ఆక్రమించుకుంటాం: సీఎం సువేందు కేబినెట్ మంత్రి వెల్లడి: డెడ్ లైన్
పశ్చిమ బెంగాల్ మంత్రి అర్జున్ సింగ్ బంగ్లాదేశ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబోయే డిసెంబర్ 16వ తేదీ నాటికి బంగ్లాదేశ్‌ను ఆక్రమించుకుంటామని ప్రకటించారు. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలకు ఖచ్చితంగా ప్రతికారం తీర్చుకుంటామని అన్నారు. పొరుగు దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మంత్రిస్థాయి నాయకుడొకరు ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని కాకినారాలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి అర్జున్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల భద్రత విషయంలో ఇకపై ఎలాంటి సాకులు చెల్లవని, పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులకు ఎలాంటి భద్రత ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ హిందువులు దుర్భర జీవితం గడుపుతున్నారని, భయాందోళనల మధ్య బతుకుతున్నారని అన్నారు.

దీనికి ప్రతీకారంగా డిసెంబర్ 16వ తేదీ నాటికి బంగ్లాదేశ్ ను ఆక్రమించుకుంటామని అర్జున్ సింగ్ స్పష్టం చేశారు. అక్కడి హిందువులకు విముక్తి కల్పిస్తామని, స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందువులపై యథేచ్ఛగా సాగిన దాడులకు ప్రతీకారం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. చాలాకాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొందని, శాంతిభద్రతల క్షీణిస్తోన్నాయని, గత ప్రభుత్వ హయాంలో వేలాదిమంది బంగ్లాదేశీయులు సరిహద్దులను దాటుకుని పశ్చిమ బెంగాల్‌లోకి అడుగు పెట్టారని అర్జున్ సింగ్ విమర్శించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి. మరోవంక ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటోన్న ఉద్వాసనకు గురైన ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా డిసెంబర్ 16వ తేదీన స్వదేశానికి వెళ్లనున్నారు. ఈ తేదీకి చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1971 నాటి విముక్తి పోరాట విజయ దినోత్సవాన్ని ఆ రోజునే జరుపుకోవడం బంగ్లాదేశ్ లో ఆనవాయితీ.













Click it and Unblock the Notifications
