డీలిమిటేషన్ పై కేంద్రం ప్లాన్-బి..! దేశంలో కీలక మార్పులు-విపక్షాలకు యోగీంద్ర యాదవ్ అలర్ట్..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టేందుకు వీలుగా కేంద్రం గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లుల్ని నెగ్గించుకోలేకపోయింది. దీంతో ఏ క్షణంలో అయినా మరోసారి వాటిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తమ పంతం నెగ్గించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సిద్దం చేసుకున్న ప్లాన్ బీపై స్వరాజ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు యోగీంద్ర యాదవ్ విపక్షాల్ని అలర్ట్ చేశారు. ఈ మేరకు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో ఆయన ఓ వ్యాసం రాశారు. బీజేపీ అమలు చేయబోతున్న ప్లాన్ బీ దేశంలో పెనుమార్పులకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.
యోగీంద్ర యాదవ్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న 545 లోక్ సభ స్ధానాల్ని 850కు పెంచేందుకు కేంద్రం గతంలో ప్రయత్నించింది. ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఇందులో 2027 జనాభా లెక్కల ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచడం, రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీలో మార్పులు చేయడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్లాన్ బీ అమలుకు సిద్దమవుతోంది.

దీని ప్రకారం రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని వెంటనే మార్చకుండా, ప్రతీ రాష్ట్రానికి కేటాయించిన లోక్ సభ స్ధానాల్ని 50 శాతం పెంచే ప్రతిపాదన కేంద్రం తీసుకురావచ్చని యోగీంద్ర యాదవ్ అంచనా వేస్తున్నారు. తద్వారా ప్రస్తుత రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తి మార్చకుండానే, లోక్ సభ స్ధానాలు పెంచవచ్చని ఆయన తెలిపారు. దీని వల్ల బీజేపీకి మూడు ప్రయోజనాలున్నట్లు ఆయన తెలిపారు. మొదటిది 2029 ఎన్నికలకు ముందే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు- ఇలా జరిగితే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా నియోజకవర్గాల పునర్ వ్యవస్ధీకరణ జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే రెండో అంశం ప్రతిపక్ష నేతల బలమైన నియోజకవర్గాల్ని రిజర్వుడ్ సీట్లుగా మార్చేయడం.

అలాగే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వ్ చేసే నియోజకవర్గాల కేటాయింపులోనూ రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు. మూడో అంశం భవిష్యత్తులో లోక్ సభ సీట్ల పంపిణీపై నియంత్రణ. వీటికి వ్యతిరేకంగా విపక్షాలు ఇప్పటి నుంచే సిద్దం కావాలని యోగీంద్ర సూచించారు. ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్ లో ఐక్యంగా వ్యవహరించడంతో పాటు ప్రజల్లోనూ వీటిపై అవగాహన కల్పించాలన్నారు. డీలిమిటేషన్ పై ప్రస్తుతం ఉన్న నిషేధం 2027 జనాభా లెక్కలు విడుదల తర్వాత ముగిసే అవకాశం ఉందని, కాబట్టి డీలిమిటేషన్ కోసం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. గతంలో అనుసరించిన విధానాల తరహాలోనే కొత్త డీలిమిటేషన్ చట్టాన్ని సాధారణ మెజార్టీతోనే పార్లమెంట్ లో నెగ్గించుకోవచ్చన్నారు.














Click it and Unblock the Notifications
