ఫ్లిప్‌కార్ట్ లో భారీ కుదుపు- వైదొలగిన సీఈఓ
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. 11 సంవత్సరాల పాటు సీఈఓగా వ్యవహరించిన ఆయన ఇక పదవి నుంచి వైదొలిగారు. ఆయన నిష్క్రమణను సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. శాశ్వత ప్రాతిపదికన నూతన సీఈఓ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు వివరించింది.
అప్పటివరకు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తారని వెల్లడించింది. త్వరలోనే కొత్త సీఈఓ ఎవరనేది ప్రకటిస్తామని పేర్కొంది. కళ్యాణ్ కృష్ణమూర్తి సంస్థను వీడటానికి గల స్పష్టమైన కారణాలను ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక ప్రకటనలో పొందుపర్చలేదు. ఈ కీలక పరిణామంపై ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ స్పందించింది.

భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగినా లావాదేవీలు సజావుగా సాగుతాయని పేర్కొంది. శరవేగంగా విస్తరిస్తోన్న భారతీయ డిజిటల్ రిటైల్ మార్కెట్‌లో తమ సంస్థ దీర్ఘకాలిక ప్రయణం కొనసాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
కళ్యాణ్ కృష్ణమూర్తి 2017 జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2018లో గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ సాధారణ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి నిత్యావసర సరుకుల విక్రయాలు, డిజిటల్ చెల్లింపులు వంటి పలు నూతన విభాగాలకు విస్తరించింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ బిలియన్ డాలర్ల ఒప్పందంతో ఫ్లిప్‌కార్ట్‌ను స్వాధీనం చేసుకోవడంలో గానీ, ఆ తదుపరి కాలంలో కంపెనీని మరింత పటిష్టం చేయడంలోనూ ఆయన కీలక పాత్రను పోషించారు.
ప్రొక్టర్ అండ్ గాంబుల్ తో తన కెరీర్‌ను ప్రారంభించారు.. కల్యాణ్ కృష్ణమూర్తి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెట్టడానికి ముందు కళ్యాణ్ కృష్ణమూర్తి టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన భారత్‌లోని టైగర్ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధం ఏర్పడింది. అంతకుముందు ఈబే ఆసియా పసిఫిక్, ఈబే సౌత్ ఆసియాలల్లో పని చేసిన అనుభవం ఆయనకు కలిసి వచ్చింది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 500 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లతో దేశంలోనే మంచి ఆదరణ పొందిన డిజిటల్ షాపింగ్ ప్లాట్ ఫామ్ గా నిలిచింది. కొంతకాలంగా ఐపీఓ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో గ్రూప్ సీఈఓ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సారథ్యంలో సంస్థ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలగకుండా సజావుగా సాగుతాయని సంస్థ యాజమాన్యం పేర్కొంది.













Click it and Unblock the Notifications
