గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ - కుంభమేళా తరహా ఏర్పాట్లు, ఈ సారి ప్రత్యేకతలు..!!
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే పుష్కరాల ముహూర్తం ఖరారైంది. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పుష్కరాలకు భక్తులు తరలి రానున్నారు. ప్రత్యేకంగా రైల్వే శాఖ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఆర్టీసీ సైతం బస్సుల ఏర్పాటుకు సమాయత్తం అవు తోంది. ఇక.. ప్రభుత్వం ఈ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ పుష్కరాల్లో పాల్గొంటారు. కుంభమేళ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు.
గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.

భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
కాగా, రాజమండ్రి నగర బ్యూటిషికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు. ఇప్పటికే ప్రారంభించిన పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పుష్కరాల్లో ఒక రోజు పాల్గొంటారు. మహా కుంభమేళా నిర్వహణలో అనుసరించిన ఉత్తమ విధానాలను ఇక్కడా అమలు చేయనున్నారు. వసతి కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల రద్దీని అంచనా వేయడం, ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పించడం, రవాణాను క్రమబద్ధీకరించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యవస్థలను సిద్ధం చేయడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు రాష్ట్రంలో మంచి స్వాగతం లభించేలా విజయవాడ, రాజమహేంద్రవరం, భోగాపురం విమానాశ్రయాలను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు.













Click it and Unblock the Notifications
