TTD: వీరికి టోకెన్లు లేకపోయినా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, తొలి రెండు రోజులు ఇలా..!!
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు నిర్ణయించారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు ఈ దర్శనం దక్కనుంది. తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల కు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్లైన్ లక్కీడిప్ విధానం ద్వారా కేటాయించనున్నారు. మిగిలిన రోజుల్లో టోకెన్లు లేకున్నా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల పై టీటీడీ తుది కసరత్తు చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించిన టోకెన్ల ఈ-డిప్ కోటాను ఈ నెల 27న ఆన్లైన్లో విడుదల చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్దం చేసింది. డిసెంబరు 20 నుంచి 29 వరకు పదిరోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తొలి రెండురోజులకు సంబంధించి దాదాపు 1.60 లక్షల టోకెన్లను నవంబరు 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించి ఆ తర్వాత డిప్ ద్వారా టోకెన్లు కేటాయించే అంశంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. అలాగే డిసెంబరు 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 దర్శన టికెట్లు కూడా కేటాయించనున్నారు.

ఈ నెల 27న ఈ డిప్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభం
కాగా, మొదటి రెండురోజులు మినహాయిస్తే మిగిలిన ఎనిమిది రోజులు ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేకపోయినా తిరుమలకు వచ్చే భక్తులందరికి వైకుంఠద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 10 రోజుల్లో 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశారు. టోకెన్లు, టికెట్ల విడుదల తేదీలు దాదాపుగా ఖరారైనప్పటికీ స్వర్ణాభరణాల విరాళ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పది రోజుల పాటు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా తిరుమలకు విచ్చేసే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన అనుమతి ఉంటుంది. గతేడాది 7,83,413 మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 8.34 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.













Click it and Unblock the Notifications
